Mobile Health Unit: గ్రామాల్లోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:44 AM
గ్రామాల్లోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసే విధంగా జిల్లాకో మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ వాహనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర వైద్య..
త్వరలో మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ వాహనాలు.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
రాష్ట్రంలోని 34 జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ప్రారంభం
ఆ సెంటర్లలో క్యాస్సర్ డయాగ్నసిస్, కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసే విధంగా జిల్లాకో మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ వాహనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలోని 34 జిల్లాల్లో ఉన్న బోధనాస్పత్రుల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిక్ట్ క్యాన్సర్ డే కేర్ సెంటర్లను సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి మంగళవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంకాలజిస్టు నోరి దత్తాత్రేయుడు సూచనల మేరకు ఈ క్యాన్సర్ డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. క్యాన్సర్ బాధితులు కీమోథెరపీ కోసం ఇకపై హైదరాబాద్ వెళ్లనవసరం లేదన్నారు. క్యాన్సర్ డే కేర్ సెంటర్లలో క్యాన్సర్ స్ర్కీనింగ్, డయాగ్నసిస్, కీ మోథెరపీ, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. డే కేర్ సెంటర్ల వల్ల రోగులపై ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ఇక, ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు మొబైల్ స్ర్కీనింగ్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ వాహనాలు గ్రామాలకు వెళ్లి పరీక్షలు చేస్తాయని, క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని డే కేర్ సెంటర్‌కు సిఫారసు చేస్తాయని మంత్రి వివరించారు. అనంతరం, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషల బోధనకు సం బంధించి ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఈఎ్‌ఫఎల్‌యూ)తో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. నర్సులకు మెరుగైన ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని మంత్రి దామోదర ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, డీఎంఈ నరేంద్రకుమార్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనివాసులు, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘గాంధీలో పాలియేటివ్.. వనస్థలిపురంలో కీమోథెరపీ యూనిట్లు
రాష్ట్రంలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో పాలియేటివ్ కేర్ యూనిట్, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కీమోథెరపీ యూనిట్ ప్రారంభమయ్యాయి. క్యాన్సర్ రోగులు డే కేర్ సెంటర్‌లో కిమోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ ఈ సందర్భంగా కోరారు.