Indira Mahila Shakti: మహిళల ఉన్నతే.. ప్రగతి
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:57 AM
మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో తమ ప్రభుత్వం కార్యక్రమాలు...
వారి అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మహిళా సంఘాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు
ఆన్‌లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్‌తో సంప్రదింపులు
ఆడబిడ్డలకు చీర, సారె పెట్టడం తెలంగాణ సంప్రదాయం: సీఎం రేవంత్
హైదరాబాద్ /హైదరాబాద్ సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఆడబిడ్డలకు చీర, సారె పెట్టడం తెలంగాణ సంప్రదాయమని, అందుకనుగుణంగానే ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డనూ తోబుట్టువుగా భావించి చీర పెడుతోందని చెప్పారు. కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తామన్నారు. బుధవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ జిల్లాలకు చెందిన మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలు అందించి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ అని, బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని కొనియాడారు. దేశంలో అనేక విప్లవాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ‘‘ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతోపాటు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్ బంక్‌లు అప్పగించడం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు బస్సులకు యజమానులను కూడా ఆడబిడ్డలను చేశాం.’ అని సీఎం వివరించారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళతామని, ఇందుకోసం అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆశ చూపించి మోసం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి విడతగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు కట్టిస్తున్నామని, ప్రతి ఇంటికీ రూ.5 లక్షలను ఆడబిడ్డల పేరుతో ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన చీరలను పొలాల వద్ద పిట్టలను తరిమేందుకు కట్టుకునే పరిస్థితి ఉండేదని, వాటిపై చాలా మంది మహిళలు నిరసన తెలిపారని గుర్తు చేశారు. అనంతరం సచివాలయం నుంచి జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌సీ) సభ్యులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికీ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో నిర్వహించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ప్రస్తుతం 65 లక్షల చీరలు సిద్ధమయ్యాయని సీఎం తెలిపారు. మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ చీరలను తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవమైన డిసెంబరు 9 వరకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇంకా 35 లక్షల చీరలు రావాల్సి ఉందని, వాటిని వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలోపు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తామని తెలిపారు.
అవకాశం ఉన్నచోటల్లా ప్రోత్సాహం..
మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే నినాదంతో తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని, తాము వడ్డీలేని రుణాలు ఇవ్వడంతోపాటు అందుకు సంబంధించిన నిధులు విడుదల చేశామని అన్నారు. యూనిఫారాలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో రూ.534 కోట్ల పనులు చేపట్టామని, ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పామని వివరించారు. శిల్పారామం పక్కన మూడెకరాల స్థలంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని తెలిపారు. కాగా, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలనే సంకేతాన్నిచ్చేలా చీరలకు ఆకాశం రంగును ఎంచుకున్నామన్నారు.
మీ పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోంది?
మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా పలువురు మహిళలతో సీఎం రేవంత్ సంభాషించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని ఉద్దేశించి ‘‘మీ సంఘం ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోంది?’’ అని సీఎం ప్రశ్నించారు. ఇందుకు ఆమె సమాధానమిస్తూ.. పెట్రోల్ బంక్ బాగా నడుస్తోందని, నెలకు రూ.4 లక్షల రాబడి వస్తోందని తెలిపారు. రూ.2 లక్షలు ఖర్చులు పోను రూ.2 లక్షల వరకు మిగులుతోందని చెప్పారు. దాంతో ఇతర జిల్లాల నుంచి కూడా సంఘాలను అక్కడికి తీసుకెళ్లి వారి పనితీరు, రాబడిని ప్రత్యక్షంగా చూపించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. కాగా, తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరలు ఇవ్వడంతో తమకు యూనిఫాం వచ్చినట్లుగా సంతోషంగా ఉందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
‘కలెక్టర్‌గారూ.. తెలుగులో మాట్లాడండి’
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్న గరీమా అగర్వాల్ తన తన ప్రసంగాన్ని ఇంగ్లీషులో ప్రారంభించడంతో.. సీఎం జోక్యం చేసుకొని తెలుగులో మాట్లాడాలని సూచించారు. ‘‘సమావేశంలో మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. ఆంగ్లంలో మీరు చెబుతున్న వివరాలు వారికి అర్థంకావు. మీకు తెలుగు వచ్చు కదా! తెలుగులో మాట్లాడండి’’ అని సీఎం అన్నారు. దీంతో ఇన్‌చార్జి కలెక్టర్ తన ప్రసంగాన్ని తెలుగులోనే కొనసాగించారు. ఈ విషయం సామాజిక మాఽధ్యమాల్లో వైరల్‌గా మారింది.