Telangana Govt: కార్బన్ క్రెడిట్ వ్యాపారానికి స్వాగతం
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:20 AM
ప్రపంచ దేశాలతో పోటీ పడతామని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం.. భవిష్యత్తులో తెలంగాణ ఏ స్థాయిలో ఉండాలనే దానిపై రూపొందించిన విజన్ డాక్యుమెంట్...
విజన్ డాక్యుమెంట్‌లో ప్రభుత్వం ఫ్రేమ్ వర్క్
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్ర జ్యోతి): ప్రపంచ దేశాలతో పోటీ పడతామని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం.. భవిష్యత్తులో తెలంగాణ ఏ స్థాయిలో ఉండాలనే దానిపై రూపొందించిన విజన్ డాక్యుమెంట్-2047లో దేశం కూడా ఆలోచన చేయని అనేక అంశాలను పొందుపరిచింది. అందులో కార్బన్ క్రెడిట్ వ్యాపారాన్ని ప్రోత్సహించే దిశగా విధాన రూపకల్పన చేసింది. కార్బన్ క్రెడిట్లు, ఉద్గారాల వ్యాపారం (ఎమిషన్స్ ట్రేడింగ్) కోసం ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది. దాని ప్రకారం రాష్ట్రంలో స్టేట్ కార్బన్ మార్కెట్ ఫ్రేమ్ వర్క్‌ను అమలు చేయనుంది. తద్వారా తక్కువ కార్బన్ పెట్టుబడులను ప్రోత్సహించడం, కార్బన్ ఫైనాన్స్‌కు అవకాశాలు సృష్టించడంపై దృష్టి సారించింది. ఇంధనం, వ్యవసాయం, పరిశ్రమ, వ్యర్థాల నిర్వహణ విభాగాల్లో ఏర్పాటు చేసే ప్రాజెక్టుల రిజిస్ర్టేషన్ కోసం డిజిటల్ తెలంగాణ కార్బన్ రిజిస్ర్టీ(టీసీఆర్)ని నెలకొల్పనున్నట్లు తెలిపింది. ఈ రిజిస్ర్టీ వ్యవస్థ భారత దేశంలోని కార్బన్ క్యాప్చర్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ స్టోరేజ్ (సీసీటీఎస్) విధానంతో, అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లతో అనుసంధానమై పనిచేస్తుంది. రాష్ట్ర నెట్ జీరో కమిషన్ ఆధ్వర్యంలో కార్బన్ ప్రాజెక్టు ఫెసిలిటేషన్ సెంటర్(సీపీఎ్‌ఫసి) ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రం ద్వారా ప్రాజెక్టుల ధ్రువీకరణ, నిర్వహణ, తనిఖీలు నిర్వహిస్తూ వాటి సామర్థ్యాలు పెంచేందుకు దోహదపడతారు. అంతేకాకుండా కార్బన్ ఆధారిత ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు, దీన్ని ఆదాయ వనరుగా మార్చుకునేవారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వమే స్టేట్ కార్బన్ క్రెడిట్ ఫండ్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రతిపాదించింది. ముందుకొచ్చే ప్రాజెక్టులకు సీడ్ ఫండ్ కింద ప్రారంభ పెట్టుబడులను అందించనుంది. ఈ నిర్ణయం వల్ల కార్బన్ క్రెడిట్ వ్యాపారం రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపును పొందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కార్బన్ క్రెడిట్ అంటే..
ఏదైనా కంపెనీ.. ఒక టన్ను కార్బన్ డై ఆక్సైడ్ (సీవో2) లేదా దానికి సమానమైన గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం, ఎవరైనా ఒక ప్రాజెక్టు ద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తే ఆ తగ్గింపునకు ప్రభుత్వం కార్బన్ క్రెడిట్ ఇస్తుంది. ఒక మునిసిపాలిటీ ఏడాదిలో 100 టన్నుల సీవో2 తగ్గిస్తే దానికి 100 కార్బన్ క్రెడిట్ దక్కుతుంది. దీనిని నగదుగా మార్చుకునే అవకాశాలుంటాయి. కాలుష్యాన్ని ఒకరు తగ్గిస్తే.. తగ్గించలేకపోయినవారు కాలుష్యాన్ని తగ్గించిన వారి నుంచి కార్బన్ క్రెడిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. స్టీలు, సిమెంట్ పరిశ్రమలు కాలుష్యాన్ని పెంచితే.. సౌరవిద్యుత్తు, అడవుల పెంపకం, వ్యర్థాల రీసైక్లింగ్, బయోగ్యాస్ ప్లాంట్లు కాలుష్యాన్ని తగ్గించి కార్బన్ క్రెడిట్లు పొందవచ్చు.