Share News

Bala Bharosa Scheme: పిల్లల ఆరోగ్యం కోసం బాల భరోసా

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:59 AM

ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వహించిన సర్వేలో దాదాపుగా 8 లక్షల మంది చిన్నారుల్లో....

Bala Bharosa Scheme: పిల్లల ఆరోగ్యం కోసం బాల భరోసా

  • త్వరలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

  • ఇటీవలి సర్వేలో 8లక్షల మందికి వైకల్యాల గుర్తింపు

  • వారికి శస్త్రచికిత్సలతోపాటు మెరుగైన వైద్య సహాయం

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వహించిన సర్వేలో దాదాపుగా 8 లక్షల మంది చిన్నారుల్లో వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం (పోషకాహారలోపం), రక్తహీనత, వినికిడి, దృష్టి లోపాలు, శారీరక వైకల్యాలు వంటి లక్షణాలు గుర్తించారు. ఈ చిన్నారులందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్య సాయం అందించేందుకు ‘బాల భరోసా’ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైకల్యాలను సరిచేసేందుకు శస్త్రచికిత్సలు చేయడం, వినికిడి యంత్రాల అమరిక..ఇలా అనేక చికిత్సలు ఇందులో ఉంటాయి. వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమశాఖలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. బాల భరోసాకు ఆరోగ్య శ్రీ పథకాన్ని అనుసంధానం చేయనున్నారు. ఆ పథకం వర్తించని వ్యాధులుంటే.. సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో అమలవుతున్న రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్‌బీఎ్‌సకే) పథకాన్ని కూడా బాల భరోసాతో అనుసంధానం చేయనున్నారు. బాల భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రతి చిన్నారి వైద్య చరిత్రను ట్రాక్‌ చేయడం, చికిత్సల పురోగతిని పర్యవేక్షించడం... సులభతరం కానుంది. బాల భరోసా పథకం విజయవంతమైతే.. లక్షలాది మంది చిన్నారులకు బాల్యంలోనే మెరుగైన చికిత్సలు అంది, ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది పడనుంది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న బాల భరోసా పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు.

Updated Date - Nov 13 , 2025 | 04:59 AM