Share News

Telangana Launches Advanced T Fiber: అల్లావుద్దీన్‌.. అద్భుతపెట్టె

ABN , Publish Date - Sep 08 , 2025 | 03:21 AM

మీ ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్‌ అయితే దానికే ఇంటర్‌నెట్‌ కూడా వస్తే ఆ టీవీ నుంచే కరెంటు బిల్లు చెల్లించుకునే వీలుంటే..

Telangana Launches Advanced T Fiber: అల్లావుద్దీన్‌.. అద్భుతపెట్టె

టీ-ఫైబర్‌ కనెక్షన్‌తో సేవలన్నీ నట్టింట్లోకే!

కంప్యూటర్‌గా మారనున్న టీవీ.. ఇంట్లోనే హోంవర్కులు

టీ-శాట్‌కు అనుసంధానంతో ఇంట్లో నుంచే నేరుగా పాఠాలు వినే అవకాశం.. స్కూళ్లలో ఏఐ పాఠాల బోధన

పథకాల లబ్ధిదారులతో సీఎం నేరుగా మాట్లాడే ఏర్పాట్లు

నెట్‌, టీవీచానళ్లు, ఓటీటీలు.. ఫోన్‌లాగా పనిచేసే రిమోట్‌

ఒక టీవీ, స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టా్‌పలకు లాగిన్‌ చాన్స్‌

42వేల కి.మీ. మేర భూగర్భ వైర్లు.. 35 వేల మందికి శిక్షణ

త్వరలో రానున్న టీ-ఫైబర్‌పై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం

‘అరేబియన్‌ నైట్స్‌’ కథల్లో ‘అల్లావుద్దీన్‌ అద్భుత దీపం’ గురించి వినే ఉంటారు! ఏది అడిగితే అదిచ్చే జీనీ భూతం అందులో ఉంటుంది. ఆ దీపంలా మనకు కావాల్సిందల్లా ఇవ్వదుగానీ.. ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న టీ-ఫైబర్‌ కనెక్షన్‌ అత్యాధునిక టెక్నాలజీని నట్టింట్లోకే తీసుకొస్తుంది. ఇంటర్‌నెట్‌, టీవీ చానళ్లు, ఓటీటీలు, ఆన్‌లైన్‌ పాఠాలు.. ఒక్కటనేమిటి.. ఉపయోగించుకున్నవారికి ఉపయోగించుకున్నంత!!

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మీ ఇంట్లో ఉన్న టీవీనే కంప్యూటర్‌ అయితే? దానికే ఇంటర్‌నెట్‌ కూడా వస్తే? ఆ టీవీ నుంచే కరెంటు బిల్లు చెల్లించుకునే వీలుంటే? ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు మీరు అర్హులో కాదో తెలుసుకునే అవకాశం ఉంటే? మీ పిల్లలకు స్కూల్లో హోంవర్క్‌గా ఇచ్చే ప్రాజెక్టులను ఇంట్లో ఉన్న టీవీలోనే గూగుల్‌ ద్వారా చేసుకోగలిగితే? చానళ్లు మార్చుకోవడానికి వాడే టీవీ రిమోట్‌నే ఫోన్‌లా వినియోగించుకునే వీలుంటే?.. ఇవన్నీ కాదు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీ ఇంట్లో ఉన్న టీవీ ద్వారా మీతో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఊహలు కావు. టీ-ఫైబర్‌ కనెక్షన్‌ ద్వారా.. అతి తక్కువ ధరకే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటినీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ ఫైబర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ అధికారులు పూర్తిచేశారు. దసరా తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెకు ్టను ఆవిష్కరింపచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ-ఫైబర్‌తో ప్రజలకు అందే సౌకర్యాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.లేదు.


ఇంటింటికీ ఇంటర్‌నెట్‌..

ఇంటర్‌నెట్‌, టీవీ చానళ్లు, ఓటీటీలు.. ఈ సేవలన్నింటినీ ఒకే వేదికపై అందించేలా తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌ ‘టీ-ఫైబర్‌’ను అందుబాటులోకి తెస్తోంది. రూ.3,500 కోట్ల వ్యయంతో ఈ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టును మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,751 గ్రామపంచాయతీల పరిధిలో దాదాపు 42 వేల కిలోమీటర్ల మేర భూగర్భంలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు వేశారు. సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులను తొలుత పట్టణ ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో మొదటగా ఈ సౌకర్యాన్ని కల్పించాలని సంకల్పించింది. ఈమేరకు.. సాంకేతికంగా సమస్యలున్న కొన్ని గ్రామాలు మినహా అన్ని ప్రాంతాల్లో కేబుళ్లు అందుబాటు లోకి వచ్చాయి. ఇప్పటికే 8 నెలల నుంచి రంగారెడ్డి, నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని ఓ నాలుగు గ్రామాల్లో టీ-ఫైబర్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నారు. అందులో వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నారు. దసరా తర్వాత ప్రాజెక్టును ఆవిష్కరించాక.. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేలపైగా గ్రామాల్లో ఇది అందుబాటులోకి రానుంది. మిగిలిన గ్రామాలకు దశల వారీగా అందించనున్నారు.

ఎన్నో ప్రయోజనాలు..

స్మార్ట్‌ టీవీలకే కాదు.. పాత మోడల్‌ సీఆర్‌టీ టీవీలకు కూడా ఈ కనెక్షన్‌ ఇస్తారు. దీంతో అవి స్మార్ట్‌ టీవీలుగా మారిపోతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండు, మూడు పెద్ద కంపెనీలు అందిస్తున్న ప్రాథమిక ప్లాన్‌ల ధరల్లోనే.. టి-ఫైబర్‌ పూర్తిస్థాయి ప్లాన్‌లను అందించనుంది. ఇందులోనూ రెండు, మూడు రకాల ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కనెక్షన్‌ తీసుకున్నవారికి ఒక సెట్‌టాప్‌ బాక్స్‌ను అందిస్తారు. దాని ద్వారానే వైఫై వస్తుంది. టీవీ చానల్స్‌ చూడొచ్చు. ఆ బాక్సుతోనే టీవీ స్మార్ట్‌గా మారుతుంది. టీవీకి వెబ్‌కెమెరాను అనుసంధానించుకుంటే వీడియో కాల్స్‌ కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. పాఠశాలలకు కూడా దీనిని అనుసంధానిస్తారు. దానిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌ క్లాసులను నిర్వహించేందుకు అవకాశం ఉంది. పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చిన హోంవర్క్‌ను అందులోనే చేసుకోవచ్చు. అందుకు వీలుగా గూగుల్‌ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పరిధిలో నడిచే టీ-శాట్‌ కూడా టీ-ఫైబర్‌తో అనుసంధానమైంది. దాంతో విద్యార్థులు సెలవు రోజుల్లో, పాఠశాలలకు వెళ్లలేకపోయినప్పుడు ఇంట్లో నుంచే టీ-శాట్‌ ద్వారా పాఠాలు వినొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. వాటిపై క్లిక్‌ చేస్తే ఆయా పథకాలకు అర్హులా, కాదా అన్నది కూడా తెలుసుకోవచ్చు. కరెంటు, గ్యాస్‌ బిల్లులను చెల్లించుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోంను సులువుగా దీని ద్వారా నిర్వహించుకోవచ్చు.


ఆన్‌లైన్‌ సర్వే.. రిమోటే ఫోను..

టి-ఫైబర్‌ కనెక్షన్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే సర్వేలు నిర్వహించే ఏర్పాటుచేశారు. ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో పోల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రశ్నావళి టీవీల్లో కనబడుతుంది. రిమోట్‌ ద్వారానే ప్రజలు సర్వేలో పాల్గొనవచ్చు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు గురించి తెలుసుకునేందుకు సీఎం ప్రజలతో మాట్లాడాలనుకున్నా.. అందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డాష్‌బోర్డు ద్వారా సీఎం రాష్ట్ర వ్యాప్తంగా టీ-ఫై బర్‌ వివరాలన్నీ నిత్యం గమనిస్తుంటారు. ఆ డాష్‌బోర్డు నుంచే నేరుగా వీడియోకాల్‌ ద్వారా పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులతో ఆయన మాట్లాడొచ్చు. ఇక టీవీ చానల్స్‌ను మార్చేందుకు వినియోగించే రిమోట్‌ను ఫోన్‌లా వాడుకునేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ రిమోట్‌తోనే.. వైఫై ద్వారా ఎలాంటి చార్జీలు లేకుండా ఫోన్లు మాట్లాడుకోవచ్చు. ఇందుకు సంబంధించిన కొన్ని అనుమతుల కోసం టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి ఆమోదం లభించనుందని అధికారులు చెబుతున్నారు. టి-ఫైబర్‌ కనెక్షన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబరుతో ఒక టీవీ, స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌, ఒక ల్యాప్‌టా్‌పలో లాగిన్‌ అయ్యేలా అవకాశం కల్పించనున్నారు. ప్యాకేజీల వారీగా ఓటీటీలు అందనున్నాయి. కేబుల్‌ ద్వారా అందించే ఈ కనెక్షన్‌తో ఒక జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్‌నెట్‌ను అందించేలా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

పీపీపీ విధానంలో అమలు..

టి-ఫైబర్‌ ప్రాజెక్టును పబ్లిక్‌-ప్రైవేటు-పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సెట్‌టాప్‌ బాక్స్‌ల మరమ్మతులు, సర్వీసు అందించడం, కస్టమర్‌ కేర్‌ సర్వీసులను ఈ విధానంలో అందిస్తారు. మరమ్మతులు, ఇతర సర్వీసులను అందించే టెక్నీషియన్ల కొరత నేపథ్యంలో.. గ్రామీణ యువతకే శిక్షణ అందించి ఉపాఽధి కల్పించాలని ఫైబర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకోసం మొదటిదశలో 35వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే టి-ఫైబర్‌ ప్రాజెక్టు నిర్వహణలో లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లకు కూడా అవకాశం కల్పించనున్నారు. లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లు గ్రామాల్లో ఇంటింటికీ కేబుల్‌ను వేసేందుకు వీలుగా ఆర్థిక సహాయం కోసం స్త్రీ నిధి నుంచి రుణాలను ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. టి-ఫైబర్‌ ప్రాజెక్టుకు ఆదాయం సమకూర్చుకునేందుకు వీలుగా వ్యాపార, వాణిజ్య ప్రకటనలను తీసుకోనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించనున్నారు.


A.jpg

ఇప్పటివరకూ ఈ జిల్లాల్లో..

మహబూబ్‌నగర్‌, జనగామ, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, గద్వాల, నారాయణపేట, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, పెద్దపల్లి, జగిత్యాల, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో టి-ఫైబర్‌ సేవలు అందుబాటులోకి రావడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నాగర్‌కర్నూల్‌, సంగారెడ్డి, సూర్యాపేట, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో కేబుల్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తికానున్నాయి.

B.jpg

ఈ జిల్లాల్లో సమస్యలు..

ఆదిలాబాద్‌, భూపాలపల్లి, నిర్మల్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ములుగు జిల్లాల్లో అటవీ అనుమతుల కోసం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. మేడ్చల్‌మల్కాజ్‌గిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పలు సాంకేతిక సమస్యలతో పనులు ఆగిపోయాయని, భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎ్‌సఎన్‌ఎల్‌)తో చర్చలు జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. సమస్యలన్నీ పరిష్కారమైతే ఈ జిల్లాల్లో కూడా కేబుల్‌ను ఏర్పాటుచేయనున్నారు. కాగా 77 చోట్ల గ్రామపంచాయతీ భవనాలు అందుబాటులో లేక కేబుల్‌ సౌకర్యాన్ని అందించలేదు.

Updated Date - Sep 08 , 2025 | 04:41 AM