Share News

Supreme Court orders: తెలంగాణ జ్యుడీషియల్‌ సర్వీసు పరీక్ష ఫలితాలు ప్రకటించండి

ABN , Publish Date - Sep 27 , 2025 | 03:15 AM

తెలంగాణలో 2023లో జరిగిన జ్యుడీషియల్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష ఫలితాలను ప్రకటించాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది...

Supreme Court orders: తెలంగాణ జ్యుడీషియల్‌ సర్వీసు పరీక్ష ఫలితాలు ప్రకటించండి

  • 2 నెలల్లో జిల్లా జడ్జీలను నియమించండి

  • నియామకం తేదీ నుంచే సీనియార్టీ లెక్కింపు

  • 2023నాటి రూల్స్‌ రాజ్యాంగబద్ధమే

  • సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2023లో జరిగిన జ్యుడీషియల్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష ఫలితాలను ప్రకటించాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అర్హత సాధించిన వారిని రెండు నెలల్లోపు జిల్లా జడ్జీలుగా నియమించాలని సూచించింది. 2023నాటి తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీస్‌ నిబంఽధనలు భవిష్యత్‌లో జరిగే అన్ని నియామకాలకు వర్తిస్తాయని తెలిపింది. వాటి రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించలేమని స్పష్టం చేసింది. హైకోర్టు రూపొందించిన ఆ నిబంధనలు రాజ్యాంగంలోని 233 అధికరణ ప్రకారం సరైనవేననని తేల్చింది. తెలంగాణ రాష్ట్ర కోర్టుల్లో ఏడేళ్ల పాటు ప్రాక్టీసు ఉంటేనే జిల్లా జడ్జీ పదవులకు అర్హులని 2023లో హైకోర్టు నిబంధనలు రూపొందించింది. స్థానిక చట్టాలు, భాష, కోర్టు విధానాల్లో సరైన పరిజ్ఞానం ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిబంధనలను రూపొందించినట్టు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి. వినోద్‌ కుమార్‌ల ధర్మాసనం ఓ తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ ఆగస్టిన్‌ జార్జి మాసిహ్‌ విచారించారు. పిటిషన్‌దారుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు మీనాక్షి అరోరా, సాదినేని రవికుమార్‌లు వాదిస్తూ ఒక రకంగా స్థానికులకు రిజర్వేషన్‌ కల్పించడంలాంటిదేనని చెప్పారు.


దాని వల్ల ఇతర అర్హుల పట్ల వివక్ష చూపినట్లవుతుందని తెలిపారు. సీనియర్‌ న్యాయవాది జి. విద్యాసాగర్‌ హైకోర్టు వైఖరిని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 2023 నాటి నిబంధనలను సడలించబోదని తెలిపారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ నిబంధనను అమలు చేయకుండా అర్హత సాధించిన వారిని జిల్లా జడ్జీలుగా నియమించేందుకు అభ్యంతరం లేదని తెలిపిందని చెప్పారు. ఈ ఒక్కసారికి మాత్రమే మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. హైకోర్టు అందించిన సహకార వైఖరిని ప్రశంసించిన ధర్మాసనం దీనిని ప్రత్యేక కేసుగా భావించి ఈసారి అర్హులైన వారిని జిల్లా జడ్జీలుగా నియమించేందుకు అనుమతించింది. ఈ తీర్పు భవిష్యత్‌ నియామకాలకు వర్తించదని తెలిపింది. నిబంధనలు రూపొందించే అథారిటీగా హైకోర్టుకు ఉన్న హక్కులను గౌరవిస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో జరిగే నియామకాలకు అర్హత సాధించాలంటే తెలంగాణలో ప్రాక్టీసు చేయడం అవసరమని తెలిపింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు నియామకాలు జరుగుతున్నందువల్ల జిల్లా జడ్జీలుగా నియమించిన తర్వాత తమకు బకాయిలు చెల్లించాలని కోరే అధికారం పిటిషన్‌దారులకు ఉండదని తెలిపింది. నియమించిన రోజు నుంచే వారి సీనియార్టీని లెక్కిస్తారని పేర్కొంది. ఇప్పటికే జడ్జీలుగా నియమితులైనవారు వారి కంటే సీనియర్లు అవుతారని తేల్చిచెప్పింది.

Updated Date - Sep 27 , 2025 | 03:15 AM