Telangana Rising Global Summit: ఉజ్వల తెలంగాణలో మీరూ..
ABN , Publish Date - Nov 29 , 2025 | 04:05 AM
రండి.. ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి అనే నినాదంతో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది...
3 వేల మందిని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం
ప్రముఖులకు సీఎం రేవంత్ పేరిట లేఖలు
సదస్సుకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బెయ్లిర్, ఆనంద్ మహీంద్ర తదితరులు
ముగింపు ఘట్టానికి అతిథిగా మెస్సీ
ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహణ
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘రండి.. ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి’ అనే నినాదంతో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. డిసెంబరు 8, 9 తేదీల్లో నగర శివార్లలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 3వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సదస్సుకు ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశీకులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈవోలు సదస్సుకు హాజరు కానున్నారు. ఆహ్వాన లేఖలను ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరిట పంపిస్తోంది. ‘‘వికసిత్ భారత్-2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యా్‌పను రూపొందించింది. ఈ లక్ష్యాలను, మా ప్రభుత్వ సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబరు 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలి రండి’’ అనే సందేశంతో ప్రముఖులకు ఈ ఆహ్వానం పంపించారు. ప్రభుత్వ ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో కొందరు.. సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశానికి చెందిన షేక్ తారిఖ్ అల్ ఖాసిమీ, రాస్ అల్ ఖైమా, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్, ఎన్రిషన్ వ్యవస్థాపక భాగస్వామి డబ్ల్యూ విన్‌స్టన్, మాండల్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈవో బెనెట్ నియోతోపాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. తెలంగాణ ప్రగతి, సంక్షేమాన్ని, అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించటంతోపాటు గ్లోబల్ ఇన్నోవేషన్ దిశగా తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పాలని సంకల్పించింది. శుక్రవారం సదస్సు లోగోను విడుదల చేసింది.
లియోనెల్ మెస్సీ రాకతో ముగింపు..
రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబరు 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. 13న ప్రపంచ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలవనుంది. ఈ మేరకు హైదరాబాద్‌కు తన రాకను మెస్సీ ‘ఎక్స్’లో ధ్రువీకరించారు. హైదరాబాద్‌తో సహా నాలుగు నగరాల్లో ఆయన పర్యటన ఉండనుంది. 13న మెస్సీ కోల్‌కతాలో దిగుతారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 14న ముంబైలో పర్యటిస్తాడు. 15న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. భారత్‌కు తన రాకను వివరిస్తూ, ‘‘నాపై భారత్ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. కొద్ది వారాల్లో భారత సందర్శనకు వస్తున్నా. త్వరలో మీ అందరినీ కలుస్తా’’ అని మెస్సీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్‌కి సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘మీరు హైదరాబాద్‌కు వస్తుండడం మా అందరికీ ఉత్తేజం కలిగిస్తోంది. మా ప్రాంతంలోని ప్రతి ఒక్క ఫుట్‌బాల్ అభిమానికీ మిమ్మల్ని చూడాలనేది ఒక కల. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సిద్ధంగా ఉంది’’ అని ‘ఎక్స్’లో తెలిపారు.