Telangana Education: సర్కారు కాలేజీల్లో పాఠాలుప్రైవేటులో ప్రయోగాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:16 AM
హైదరాబాద్ నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ చదువుతున్న 120 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ చేద్దామంటే సరైన ప్రయోగశాలలు లేవు..
సమీప ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వసతులు వాడుకోవచ్చు
ప్రాక్టికల్ విద్యలో కొత్త సంస్కరణ.. టీ-స్టెమ్
నైపుణ్యాభివృద్ధి శిక్షణలో ముందడుగు
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న ఇంటర్ బోర్డు
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ చదువుతున్న 120 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ చేద్దామంటే సరైన ప్రయోగశాలలు లేవు. అయితే ఈ కాలేజీకి కిలోమీటరు దూరంలోనే మాసబ్‌ట్యాంకు ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది. ఇందులో ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులకు అవసరమయ్యే, సరిపడే అన్ని వసతులున్నాయి.దీంతో ఇప్పుడు నాంపల్లి ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్‌కు వెళ్లి అక్కడి వసతులు ఉపయోగించుకోవచ్చు.
గచ్చిబౌలిలో ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కాలేజీ ఉంది. ఏటా 180 మంది ఇందులో ప్రవేశాలు తీసుకుంటారు. కోర్సులో భాగంగా నైపుణ్యాలు అందించేందుకు సరిపడా యంత్రాలు ఈ కాలేజీలో లేవు. అయితే కిలోమీటరు దూరంలోనే జి.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (జీఎన్‌ఐటీ) కాలేజీ ఉంది. ఇందులో 3డి ప్రింటింగ్, ఏఐ, ఎంఎల్ గ్రాఫిక్ సర్వర్ లాంటి అత్యాధునిక యంత్రాలతో కూడిన అధునాతన ల్యాబ్ ఉంది. ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ విద్యార్థులు ఇక్కడి ల్యాబ్‌ను వినియోగించుకొని నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఇలా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు సమీపంలోని ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని వసతులను ఉపయోగించుకునే సరికొత్త విధానం రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. టీ-స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్)ను ఇంటర్ బోర్డు అమల్లోకి తెచ్చింది. సరైన వసతులు లేని కారణంగా విద్యార్థులు నైపుణ్యాలకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాలతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) దీన్ని అభివృద్ధి చేసింది. ఇందుకోసం విద్యార్థులు ముందుగా ఠీఠీఠీ.్టట్ట్ఛఝ.ఛిజజ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. పేరు, కాలేజీ, కోర్సు వివరాలు, ఫోన్‌నంబర్ నమోదు చేయాలి. వీరికి కావాల్సిన ప్రయోగశాలలున్న సమీప కాలేజీల వివరాలు అందిస్తారు. ఈ సేవలను రాష్ట్రంలోని 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులతోపాటు కేజీబీవీ, టీఎ్‌సఆర్జేసీ, ఇతర ప్రభుత్వ గురుకులాల విద్యార్థులూ వినియోగించుకోవచ్చు. దీన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 23న 4 కాలేజీల్లో విజయవంతంగా చేపట్టారు. శనివారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల విద్యార్థులకు కొత్త విధానం అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. ఇంటర్ విద్యకు అవసరమయ్యే ప్రయోగ శిక్షణ అందించడంతోపాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో ఆసక్తి ఉన్న విద్యార్థులు సైతం సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని వసతులను పూర్తిగా వినియోగించుకోవచ్చని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. దీని కోసం ఇప్పటికే ప్రైవేటు కాలేజీలతో ఇంటర్ బోర్డు ఒప్పందాలు కుదుర్చుకుంది.