Share News

Affordable housing: హౌసింగ్‌ బోర్డు పరిధిలోని సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్ల విక్రయం

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:20 AM

సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే అల్పాదాయ వర్గాల ప్రజలకు తెలంగాణ హౌ సింగ్‌ బోర్డు తీపి కబురు చెప్పింది...

Affordable housing: హౌసింగ్‌ బోర్డు పరిధిలోని సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్ల విక్రయం

  • అల్పాదాయ వర్గాలకు మాత్రమే అవకాశం

  • గచ్చిబౌలిలో ఫ్లాటు ధర రూ.26-36 లక్షలు

  • గచ్చిబౌలితోపాటు వరంగల్‌, ఖమ్మంలో ఫ్లాట్లు

  • జనవరి 3 దాకా ‘మీసేవ’ల్లో దరఖాస్తుకు చాన్స్‌

  • జనవరి 6, 8 తేదీల్లో లాటరీ: బోర్డు ఎండీ గౌతమ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే అల్పాదాయ వర్గాల ప్రజలకు తెలంగాణ హౌ సింగ్‌ బోర్డు తీపి కబురు చెప్పింది. హైదరా బాద్‌లోని గచ్చిబౌలితోపాటు ఖమ్మం, వరంగల్‌ నగరాల్లో హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్లలోని సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్ల ను విక్రయించనుంది. ఈ మేరకు హౌసింగ్‌ బోర్డు ఎండీ వి.పి.గౌతమ్‌ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు, వరంగల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో 102, ఖమ్మం శ్రీరామ్‌హిల్స్‌ దగ్గరలో 126 కలిపి మొత్తం 339 ఫ్లాట్లను విక్రయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం 450 చదరపు అడుగుల నుంచి 650 చదరపు అడుగుల వరకు ఉందని, గచ్చిబౌలిలో కనిష్ఠంగా రూ.26 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.36.20లక్షలు, వరంగల్‌లో రూ.19లక్షల నుంచి 21.50 లక్షలు, ఖమ్మంలో రూ.11.25లక్షల వరకు ఫ్లాట్ల ధరలు ఉన్నాయని వెల్లడించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హౌసింగ్‌ బోర్డు నిర్మించిన అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లను అఫర్డ్‌బుల్‌ హౌసింగ్‌ కింద అల్పాదాయ వర్గాలకు (ఏడాదికి రూ.6లక్షల ఆదాయం ఉన్నవారికి) విక్రయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రస్తుతం విక్రయానికి ఉంచిన ఫ్లాట్లన్నీ అభివృద్ధి చెందిన, అత్యధిక డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయని, బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుకు జనవరి 3వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. గచ్చిబౌలిలోని ఫ్లాట్లకు జనవరి 6న, వరంగల్‌, ఖమ్మంలో జనవరి 8న లాటరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. విక్రయాలకు సంబంధించిన వివరాల కోసం హౌసింగ్‌ బోర్డు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Dec 19 , 2025 | 04:20 AM