Electricity Demand: రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:09 AM
రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నెల 8న(సోమవారం) తెలంగాణలో 15,906 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది..
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నెల 8న(సోమవారం) తెలంగాణలో 15,906 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. సెప్టెంబరు నెలకు సంబంధించి ఇది రికార్డు. రాష్ట్రంలో ఇటీవల వరినాట్లు బాగా పెరగడంతోనే కరెంటుకు డిమాండ్ ఎక్కువైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న గృహ, పారిశ్రామిక విద్యుత్ వినియోగాలకు తోడు, పంటల సీజన్‌లో వ్యవసాయానికి కరెంటు డిమాండ్ ఎక్కువవుతుందని, ఈ నేపథ్యంలో గ్రామీణ జిల్లాల విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే, గతేడాది సెప్టెంబరు 8న కేవలం 9,543 మెగావాట్ల డిమాండే నమోదు కావడం ఇక్కడ గమనార్హం.