Higher Education: మే 4వ తేదీ నుంచి ఎప్‌సెట్
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:17 AM
వచ్చే విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎనిమిది ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
13, 14 తేదీల్లో ఐసెట్, 18న లాసెట్
8 ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎనిమిది ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి.. కార్యదర్శి శ్రీరాం వెంకటే్‌షతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సెట్‌ల తేదీలను విడుదల చేశారు. వ్యవసాయ, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ఎప్‌సెట్ వచ్చే ఏడాది మే 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన ఎప్‌సెట్ పరీక్ష మే 9, 10, 11 తేదీల్లో ఉంటుంది. గతేడాది ఎప్‌సెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించగా ఈసారి వారం రోజులు ఆలస్యంగా నిర్వహించనున్నారు. ఇక బీఈడీ కోర్సులకు ఉద్దేశించిన ఎడ్‌సెట్ మే12న.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఐసెట్‌ను మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. బీఈ, బీటెక్, బీఫార్మసీ యూజీ కోర్సుల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన ఈసెట్ మే15న.. మూడు, ఐదేళ్ల న్యాయవిద్య కోర్సులకు సంబంధించిన లాసెట్ మే 18న ఉంటుంది. ఎంఈ, ఎంటెక్, ఎం-ఫార్మసీ, ఎం-ఆర్కిటెక్చర్, ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశాల పీజీఈసెట్ మే 28 నుంచి 31 వరకు జరగనుంది.. వ్యాయామ విద్య యూజీ కోర్సుల పరీక్ష పీఈసెట్ మే 31 నుంచి జూన్3 వరకు నిర్వహిస్తామని చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. కోర్సుల అర్హత, ఫీజులు, దరఖాస్తులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ సంబంధిత సెట్‌ల కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు.