Telangana High Court: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అసాధ్యం!
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:43 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని...
అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం
రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోండి
హైకోర్టులో పిటిషన్.. నేడు విచారణ
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా ఆదేశాలు జారీచేయడంతోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకొండూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతాయని.. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. ‘కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వకుండా పరిమితి విధించారని.. దాన్ని అలాగే కొనసాగిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న విధంగానే బీసీలకు 26 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 9 శాతం ఇవ్వడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం అవుతాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఏర్పాటు ఉందని.. ప్రభుత్వం దాన్ని సవరించి రిజర్వేషన్లను పెంచాలని చూస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఇతర వర్గాల వారి హక్కులకు భంగం కలుగుతుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగపరంగా అసాధ్యమైన పని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల ఉద్దేశం ఓడిపోయినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవోతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు కోరారు. ఈ పిటిషన్ బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.