Share News

High Court Stay on Group 2 Exam Results: గ్రూప్‌ 2 ఉద్యోగులకు ఊరట

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:23 AM

గ్రూప్‌ 2 ఉద్యోగులకు గురువారం హైకోర్టులో ఊరట లభించింది. 2015 నాటి నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫలితాలను కొట్టివేస్తూ ఈనెల...

High Court Stay on Group 2 Exam Results: గ్రూప్‌ 2 ఉద్యోగులకు ఊరట

  • 2015 నోటిఫికేషన్‌ ఫలితాలు కొట్టివేతపైహైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్టే

  • జవాబు పత్రాల ట్యాంపరింగ్‌ జరిగినట్టు కేసు

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 ఉద్యోగులకు గురువారం హైకోర్టులో ఊరట లభించింది. 2015 నాటి నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫలితాలను కొట్టివేస్తూ ఈనెల 18న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర స్టే విధించింది. దీంతో 2015లో నోటిఫికేషన్‌ ప్రకారం పరీక్షలు రాసి, 2019లో నియామకమై, ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు అలాగే కొనసాగనున్నారు. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

గ్రూప్‌-2 సర్వీసుల్లో 1,032 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2015లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత 2016లో అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయగా, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు 2019లో నియామకపత్రాలు జారీచేశారు. అయితే ఓఎంఆర్‌ షీట్‌లోని పార్ట్‌- బీలో ఎరేజర్‌, వైట్‌నర్‌, బ్లేడ్‌ ఉపయోగించి దిద్దిన వారిని కూడా ఎంపిక చేశారని, పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ హైకోర్టులో వేర్వేరుగా ఆరు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం.. ఫలితాలను కొట్టివేస్తూ ఈనెల 18న తీర్పు ప్రకటించింది. తప్పులు చేసిన వారిని తొలగించి, మళ్లీ సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది.

సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ డిప్యూటీ తహసీల్దార్‌ క్రాంతికుమార్‌ తదితరులు హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీలుదారుల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ట్యాంపరింగ్‌, వైట్‌నర్‌, ఎరేజర్‌ల వినియోగించినట్లు తేలిందని చెబుతూ మొత్తం నియామకాలను రద్దు చేయడం సరికాదన్నారు. అలా ఉల్లంఘనకు పాల్పడిన వారి పత్రాలను తొలగించినట్లు కమిషన్‌ పేర్కొన్నా ఆ వాదనను సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వాదిస్తూ ఓఎంఆర్‌ షీట్లలో వైట్‌నర్‌, ఎరేజర్‌లు వినియోగించిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమన్నారు. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పునకు, టెక్నికల్‌ కమిటీ సూచనలకు విరుద్ధంగా ట్యాంపరింగ్‌ జరిగిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. టీజీపీఎస్సీ, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కౌంటర్‌లు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.

Updated Date - Nov 28 , 2025 | 04:23 AM