High Court: మాజీ సీఎస్ ఎస్‌కే జోషికి హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:08 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిటైర్డు ఐఏఎస్ శైలేంద్ర కుమార్ జోషిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ..
ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దంటూ ఉత్తర్వులు
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిటైర్డు ఐఏఎస్ శైలేంద్ర కుమార్ జోషిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ చేపట్టే వరకు ఈఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది. రిటైర్డు ఐఏఎస్ ఎస్‌కే జోషి బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. తనకు నోటీసులు ఇవ్వకుండా, తన వాదన వినకుం డా పీసీ ఘోష్ కమిషన్ తనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందని సహజ న్యాయసూత్రాలు, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న ఆ నివేదికను కొట్టేయాలని జోషి కొద్ది రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించామ ని తెలియజేశారు. మరోవైపు గత విచారణ సందర్భంగా కమిషన్ నివేదిక మీ చేతికి ఎలా వచ్చిందని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించిన నేపథ్యంలో.. అందుకు సంబంధించిన వివరాలతో జోషి అఫిడవిట్ దాఖలు చేశారు. వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్‌కే జోషిపై ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు మొదలుపెట్టక ముందే తనపై చర్యలు తీసుకుంటారని పిటిషనర్ భావించడం ఆందోళన మాత్రమేనని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను అక్టోబరు 7కు వాయిదా వేసింది.