High Court: స్థానిక ఎన్నికలు ఎప్పుడు?
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:25 AM
స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు తమకు తెలియజేయాలని....
రెండు వారాల్లోగా వివరాలు తెలియజేయండి
రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీని ఆదేశించిన హైకోర్టు
42% రిజర్వేషన్ల జీవోపై మాత్రమే హైకోర్టు స్టే
ఎన్నికలు ఆపాలని ఎక్కడా చెప్పలేదు
పాత 50% రిజర్వేషన్లతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేసింది
కాబట్టి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి
ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫు వాదనలు
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు తమకు తెలియజేయాలని ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)కు ఆదేశాలు జారీచేసింది. వివరాలు తెలిపేందుకు రెండు వారాల గడువిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ ఎస్‌ఈసీ జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తకొమ్ముగూడేనికి చెందిన రెంక సురేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న జీవో 9పై మాత్రమే హైకోర్టు స్టే విధించిందని.. ఎన్నికలను ఆపాలని ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. పాత 50శాతం రిజర్వేషన్లతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని కోర్టు చాలా స్పష్టంగా పేర్కొందన్నారు. అలాగే జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా లాభం లేకపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో 50 శాతం రిజర్వేషన్లు, 50ు ఓపెన్ కేటగిరీతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం తప్ప ప్రభు త్వం, ఎస్‌ఈసీలకు మరో మార్గం లేదని తెలిపారు. ఎస్‌ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదిస్తూ.. రిజర్వేషన్లను 50శాతంగా నోటిఫై చేసి సమ్మతి ఇవ్వాలంటూ ఎస్‌ఈసీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని.. తమ వైపు నుంచి ఎలాంటి ఆలస్యం లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారో 2వారాల్లోగా తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2వారాలకు వాయిదా వేసింది.