Telangana High Court: 24 గంటల్లో వార్డుల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టండి
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:46 AM
జీహెచ్‌ఎంసీ తాజాగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా వార్డులవారీగా జనాభా లెక్కలు బయటపెట్టడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి...
వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టకపోవడంలో అర్థంలేదు
వార్డుల వారీగా భౌగోళిక స్వరూపాన్ని వెల్లడించండి
జీహెచ్‌ఎంసీ పునర్విభజన పిటిషన్లపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ తాజాగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా వార్డులవారీగా జనాభా లెక్కలు బయటపెట్టడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి? అని హైకోర్టు ప్రశ్నించింది. ఆ వివరాలేవీ అందుబాటులో లేకుండానే ఇంత భారీస్థాయిలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారా? అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 24 గంటల్లో వార్డుల వారీగా జనాభా లెక్కలు, వార్డులవారీగా ధ్రువీకరించిన భౌగోళిక స్వరూపం (మాప్స్) పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు బుధవారం ఆదేశాలు జారీచేసింది. జనాభా, మ్యాప్స్ వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచినప్పటికీ నుంచి రెండురోజుల్లో పిటిషనర్లు లేదా ప్రజలు తమకు ఉన్న అదనపు అభ్యంతరాలను జీహెచ్‌ఎంసీకి సమర్పించవచ్చునని పేర్కొంది. అయితే డీలిమిటేషన్ ప్రక్రియలో అనేక లోపాలున్న నేపథ్యంలో ప్రక్రియను అడ్డుకోవాలన్న పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. వార్డులవారీగా జనాభా లెక్కలు, మ్యాప్స్ ప్రజలకు అందుబాటులో ఉంచి ముందుకు వెళ్లవచ్చునని కోర్టు స్పష్టంచేసింది. జీహెచ్‌ఎంసీ చుట్టూ ఉన్న పలు మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్‌లను విలీనం చేయడం ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిని ఓఆర్‌ఆర్ వరకు విస్తరించాలని, వార్డులను 300 వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు కమిషనర్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశారు. కాగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చట్టవిరుద్ధంగా, రాజ్యాంగవిరుద్ధంగా ఉందని.. దానిని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో దాదాపు 30 వరకు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై బుధవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషనర్‌ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ మునిసిపల్ కార్పొరేషన్స్ డీలిమిటేషన్ రూల్స్ - 1996కు విరుద్ధంగా ప్రస్తుత డీలిమిటేషన్ నోటిఫికేషన్ ఉందని పేర్కొన్నారు. వార్డుల విభజన ఎలా చేపడుతున్నారో మ్యాపులు, వార్డులవారీ జనాభా లెక్కలు అందుబాటులో ఉంచకుండా అభ్యంతరాలు ఎలా సమర్పిస్తారు? అని ప్రశ్నించారు. డీలిమిటేషన్ నిబంధనల ప్రకారం సగటు జనాభా కంటే ఆయా వార్డుల జనాభాల్లో 10 శాతం కంటే ఎక్కువ తేడాలు ఉండకూడదని తెలిపారు. జనాభా లెక్కలు లేకుండా ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు.
విలీన కార్పొరేషన్లు, అక్కడి వార్డు సభ్యులు, కార్పొరేటర్లతో ఎలాంటి కన్సల్టేషన్ లేకుండా కేవలం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఒక్కరే నిర్ణయం తీసుకోవడం చెల్లదని పేర్కొన్నారు. ఏ ప్రాంతాలు ఏయే డివిజన్లలో కలుస్తున్నాయో తెలిపేలా ధ్రువీకరించిన మ్యాప్స్ అందుబాటులో ఉండాలన్నారు. జీహెచ్‌ఎంసీ తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. ఓఆర్‌ఆర్ పరిధి వరకు జీహెచ్‌ఎంసీని విస్తరించడం ద్వారా సమానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని.. అందులో భాగంగానే డీలిమిటేషన్ చేపట్టామని.. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని తెలిపారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటు ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలిపారు. గతంలో పలు గ్రామాలను విలీనం చేస్తూ కొత్త మున్సిపాల్టీలు ఏర్పాటు చేసినప్పుడు సైతం హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయని..ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని అడ్డుకోలేమని పేర్కొంటూ ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. 24 గంటల్లో వార్డులవారీగా జనాభా లెక్కలు, మ్యాపులు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశాలు జారీచేసింది. వివరాలు అందుబాటులో ఉంచిన తర్వాత పిటిషనర్లు, ప్రజలు అదనపు అభ్యంతరాలు తెలపడానికి రెండురోజుల సమయం కేటాయిస్తూ విచారణను ముగించింది.
కౌంటర్ దాఖలుచేయనందుకు ప్రభుత్వానికి జరిమానా
తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా 2023లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ కొండాపూర్‌కు చెందిన సంతోష్ కుమార్‌తోపాటు మరికొందరు పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొన్ని రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాదులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని అభ్యర్థించారు. కౌంటర్ దాఖలు చేసేందుకు అక్టోబరులోనే ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చినా సమర్పించలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక్కో పిటిషన్‌కు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు జనవరి 9 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ప్రత్యుత్తరం దాఖలుకు పిటిషనర్లకు జనవరి 20 వరకు గడువిచ్చింది. ఆయా తేదీల తర్వాత ఎలాంటి కౌంటర్లు వేసినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. ఒకవేళ లిఖిత పూర్వక వాదనలుంటే జనవరి 30లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.