Telangana High Court: డీజీపీ ఎంపిక ప్రక్రియ కొనసాగించండి
ABN , Publish Date - Dec 25 , 2025 | 05:03 AM
రాష్ట్ర డీజీపీ బీ శివధర్‌రెడ్డి నియామకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది..
సీనియర్ ఐపీఎ్‌సల జాబితా యూపీఎస్సీకి పంపండి
సుప్రీం మార్గదర్శకాలను పాటించండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరణ
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీ బీ శివధర్‌రెడ్డి నియామకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, అర్హులైన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కి పంపించాలని ఆదేశించింది. శివధర్ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 26న జీవో జారీ చేసింది. అయితే, ఈ నియామకం చెల్లదని, సదరు జీవోను కొట్టేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన టీ ధనగోపాలరావు అక్టోబరు 10న హైకోర్టును ఆశ్రయించారు. ‘ప్రకాశ్‌సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని.. దాని ప్రకారం డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. యూపీఎస్సీ తరఫు న్యాయవాది అజయ్‌కుమార్ వాదిస్తూ డీజీపీ పోస్టు భర్తీకి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 25న రాష్ట్ర ప్రభుత్వం పంపిన సీనీయర్ ఐపీఎ్‌సల జాబితాలో ఏపీకి కేటాయించిన ఐపీఎస్ అభిలాష బిష్త్ పేరు ఉండటంపై యూపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కోరిందని తెలిపారు. దీనివల్ల నియామకంలో జాప్యం జరిగిందని, యూపీఎస్సీ అడిగిన అన్ని వివరాలు పంపిస్తే నియామక ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలను హైకోర్టుకు సమర్పించారు. ఆపై, పిటిషనర్ వ్యక్తిగత హోదాలో వాదనలు వినిపిస్తూ.. రెండు నెలలుగా బీ శివధర్‌రెడ్డి డీజీపీ పోస్టులో అక్రమంగా ఉన్నారని, ఆ నియామకాన్ని అనుమతించరాదని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ ఉత్తర్వుల్లో తాత్కాలిక నియామకం అని ఉండడంతో పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించిన జీవో కొట్టివేతకు నిరాకరించింది. కానీ, డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీనియర్ ఐపీఎ్‌సల జాబితాను యూపీఎస్సీకి మళ్లీ పంపాలని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎ్‌సల జాబితాను యూపీఎస్సీకి పంపిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.