Share News

Telangana High Court: ఆయుష్‌ వైద్యులు అల్లోపతి చికిత్స చేయడం మోసం కాదు

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:59 AM

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ (బీఏఎంఎస్‌) డిగ్రీ కలిగి, చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఆయుర్వేద వైద్యులు అల్లోపతి చికిత్స చేయడం...

Telangana High Court: ఆయుష్‌ వైద్యులు అల్లోపతి చికిత్స చేయడం మోసం కాదు

  • వారిపై కేసులు పెట్టే అర్హత తెలంగాణమెడికల్‌ కౌన్సిల్‌కు లేదు: హైకోర్టు

  • ఆయుష్‌ వైద్యులపై కేసుల కొట్టివేత

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ (బీఏఎంఎస్‌) డిగ్రీ కలిగి, చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఆయుర్వేద వైద్యులు అల్లోపతి చికిత్స చేయడం మోసం (చీటింగ్‌) కిందకురాదని హైకోర్టు పేర్కొంది. మెడిసిన్‌లో ఎలాంటి విద్యార్హత, గుర్తింపు లేదా రిజిస్ట్రేషన్‌ లేని వ్యక్తులు అల్లోపతి చికిత్స చేస్తే మాత్రం క్రిమినల్‌ కేసులు పెట్టవచ్చని తెలిపింది. ప్రస్తుత కేసులో ఆయుర్వేద వైద్యులు ఆధునిక పద్ధతుల్లో చికిత్స చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ కాబట్టి వారిపై సంబంధిత ఆయుష్‌ సంస్థకు ఫిర్యాదు చేయాలే తప్ప నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసి, క్రిమినల్‌ కేసులు పెట్టే అర్హత తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌కు లేదని స్పష్టం చేసింది. సంగారెడ్డిలోని వసంత్‌నగర్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు హెచ్‌.లోకేశ్‌ సహా కేపీహెచ్‌బీ, సంగారెడ్డి రూరల్‌కు చెందిన పలువురు ఆయుర్వేద వైద్యులు రోగులకు అల్లోపతి మందులు ఇస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. చీటింగ్‌ సహా వివిధ సెక్షన్ల కింద నమోదైన క్రిమినల్‌ కేసులను కొట్టేయాలని కోరుతూ ఆయుర్వేద డాక్టర్లు హైకోర్లులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ ప్రకారం ఆయుర్వేద డాక్టర్లకు ఆధునిక వైద్యంలో కూడా శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. అలాగే జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చట్టంలోని సెక్షన్‌ 54 ప్రకారం ఎన్‌ఎంసీకి లేదా రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌కు చెందిన అధీకృత అధికారి ఫిర్యాదు చేస్తేనే దానికి చట్టబద్ధత ఉంటుందని.. ప్రస్తుత కేసులో పిటిషనర్లపై ఇచ్చిన ఫిర్యాదులో ప్రధానంగా ఆ లోపం ఉందని పేర్కొంది. అలాగే ఆయుర్వేద డాక్టర్‌ అల్లోపతి మందులు ఇచ్చారనే అంశం మోసం కిందకు రాదని స్పష్టం చేసింది. ఆయుర్వేద వైద్యులపై పోలీసులు నమోదు చేసిన క్రిమినల్‌ కేసులను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. అయితే పిటిషనర్లు వృత్తిపరంగా తప్పు చేశారని తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ భావిస్తే చట్టప్రకారం శాఖాపరమైన చర్యలు చేపట్టవచ్చని తెలిపింది.

Updated Date - Sep 16 , 2025 | 06:00 AM