Telangana High Court: మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగితే..రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది!
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:58 AM
రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య వేగంగా పెరిగిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే వేగంతో....
హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య వేగంగా పెరిగిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే వేగంతో మద్యం దుకాణాలు బార్ల సంఖ్య పెరిగితే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. అయితే మద్యం వినియోగం, దుకాణాల సంఖ్య విషయంలో హైకోర్టు పాత్ర పరిమితమేనని అభిప్రాయపడింది. మద్యం దుకాణాల ప్రకటనల బోర్డులు కనీసం ప్రధాన రహదారి నుంచి కనిపించని విధంగా ఉండాలని తెలిపింది. దీనిపై ప్రభుత్వం ఒక విధానపర నిర్ణయం తీసుకునే వరకు తాము మార్గదర్శకాలు జారీచేయాల్సి ఉందని పేర్కొంది. నాగారం మున్సిపాల్టీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలోని నివాస గృహాల మద్యలో లిక్కర్ షాప్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ, మున్సిపల్ అధికారులకు, దుకాణదారులకు నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.