Share News

Telangana High Court:ఆట మధ్యలో రూల్స్‌ మార్చడం కుదరదు

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:12 AM

పీజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో నిబంధనలు మార్చడం సరికాదని హైకోర్టు పేర్కొంది....

Telangana High Court:ఆట మధ్యలో రూల్స్‌ మార్చడం కుదరదు

  • పీజీ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ కోటాలో 85ు తెలంగాణ స్థానికులకు ఇవ్వాలనిసవరణ తెచ్చిన ప్రభుత్వం

  • సదరు సవరణ ఈ ఏడాదికి వర్తించదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పీజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో నిబంధనలు మార్చడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఆట మొదలయ్యాక మధ్యలో రూల్స్‌ మార్చడం కుదరదు అని స్పష్టం చేసింది. ప్రైవేటు, అన్‌ఎయుడెడ్‌, మైనారిటీ, నాన్‌మైనారిటీ, పీజీ మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలోని సబ్‌ కేటగిరి-1లో 85ు సీట్లు తెలంగాణ స్థానికులకు ఇవ్వాలని ఈనెల 3న ఇప్పటికే ఉన్న రూల్స్‌కు సవరణ చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ అన్‌ఎయిడెడ్‌, నాన్‌మైనారిటీ ప్రొఫెషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ ఇన్‌టు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ ప్రొఫెషనల్‌ కోర్సెస్‌) రూల్స్‌ - 2017కు తాజా జీవో 200 ద్వారా సవరణ చేసింది.

కాగా పీజీ మెడికల్‌ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ గత నెల 4వ తేదీనే ప్రారంభమైందని.. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈనెల 3న ఇప్పటికే ఉన్న రూల్స్‌కు సవరణ చేస్తూ జీవో జారీచేయడం చెల్లదని పేర్కొంటూ ఇతర రాష్ట్రాలకు చెందిన పీజీ మెడికల్‌ అభ్యర్థులు స్వరూప్‌ మరికొంతమంది హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాథమికంగా పరిశీలిస్తే అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత సవరణ జీవో తెచ్చారని పేర్కొంది. మధ్యలో రూల్స్‌ మార్చడం చెల్లదు కాబట్టి.. ప్రస్తుతం కొనసాగుతున్న 2025-26 విద్యాసంవత్సరానికి సవరణ జీవో 200 వర్తించదని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్‌ వర్సిటీకి నోటీసులు జారీచేసింది. ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.

ఓయూ రిజిస్ట్రార్‌ హాజరుకు కోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌ నల్లకుంటలోని హిందీ మహావిద్యాలయ కళాశాలను అటానమస్‌ కాలేజీలో జాబితాలో చేర్చి.. పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాలని పేర్కొంటూ హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయలేదని.. తమ కాలేజీని అటానమస్‌ జాబితాలో చేర్చలేదని పేర్కొంటూ హిందీ మహావిద్యాలయ సంస్థ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఓయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ గడ్డం నరేశ్‌రెడ్డికి ఫారం-1 నోటీసు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - Nov 22 , 2025 | 05:12 AM