Telangana HC Says No Intervention: స్థానికతపై జోక్యం చేసుకోలేం
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:24 AM
వైద్య విద్య కోర్సుల్లో స్థానిక కోటా వర్తింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 33, 150 విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది...
సుప్రీం తీర్పు ఇచ్చాక ఈ అంశంపై విచారించలేం: హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కోర్సుల్లో స్థానిక కోటా వర్తింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 33, 150 విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక కోటాలో సీటు పొందాలంటే నీట్ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొన్ని షరతులతో ఆమోదించిందని గుర్తుచేసింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట్ గ్రామానికి చెందిన మలోతు తేజస్విని సహా ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన 34 మంది అభ్యర్థుల పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం కొట్టివేసింది.
ఏపీ సైనిక్ స్కూల్‌లో చదివిన విద్యార్థికి ఊరట
తెలంగాణ ప్రభుత్వ నిధులతో, తెలంగాణ కోటాలో ఏపీలోని కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదివిన వనపర్తి జిల్లా ఘన్‌పూర్ మండలం దొంతికుంట తండా విద్యార్థి ఎం.శశికిరణ్‌ను వైద్య విద్య అడ్మిషన్లలో స్థానికుడిగా గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ కోటాలో ఏపీలోని సైనిక్ స్కూల్‌లో చదివిన వారి పరిస్థితి ఏమిటని మంగళవారం విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి బుధవారం వివరణ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. తెలంగాణ, ఏపీ విద్యార్థులు నష్టపోకుండా పదేళ్లపాటు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కోటా ఇచ్చారని.. ఆ కోటాలో 2024 వరకు చదివిన విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. దీనితో పిటిషనర్‌ను స్థానికుడిగా గుర్తించి కౌన్సిలింగ్‌కు అనుమతివ్వాలంటూ కోర్టు విచారణను ముగించింది.