Share News

Telangana HC: బీసీలకు 17శాతం రిజర్వేషన్లు సరికాదని పిటిషన్‌

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:52 AM

సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ....

Telangana HC:  బీసీలకు 17శాతం రిజర్వేషన్లు సరికాదని పిటిషన్‌

  • వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎ్‌సఈసీ), సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల కోసం ఈ నెల 23న జిల్లా కలెక్టర్‌ (జిల్లా ఎన్నికల అధికారి) జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ అందోల్‌ మండలం రాంసాన్‌పల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ కొరబోయిన ఆగమయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బీసీల జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 42ు రిజర్వేషన్లు ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఏకసభ్య కమిషన్‌ సూచించిన మేరకు 42 శాతానికి బదులుగా రాష్ట్రవ్యాప్తంగా 17.087ు పంచాయతీ స్థానాలను కేటాయించడం సబబుకాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, డిసెంబరు 10కి విచారణ వాయిదా వేశారు.

బీసీల్లో సబ్‌ క్యాటగిరీ రిజర్వేషన్లు లేకపోవడంపై పిటిషన్‌

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ ఒకట్రెండు రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ ధర్మాసనం ముందుకు రానుంది. తెలంగాణ ప్రదేశ్‌ గంగపుత్ర సంఘం, శ్రీ మడివాల మాచదేవ రజకుల సంఘంతో పాటు మరో ముగ్గురు ఈ పిటిషన్‌ వేశారు. ‘పంచాయతీ రాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 9(4) ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో బీసీ- ఏ, బీ, సీ, డీలకు క్యాటగిరీ వారీగా రిజర్వేషన్లు కల్పించలేదు. దీంతో బీసీల్లోని.. మున్నూరు కాపు, ముదిరాజ్‌, యాదవ, గౌడ కులాలు స్థానిక సంస్థల్లో రాజకీయ అధికారాన్ని పొందుతాయి. ఇతర పేద బీసీ వర్గాల వారు పేదలుగానే మిగిలిపోతున్నారు. చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా సర్కార్‌ను ఆదేశించాలి. అప్పటివరకు జీవో 46ను నిలిపివేయాలి’ అని కోరారు.

Updated Date - Nov 27 , 2025 | 04:52 AM