Telangana HC: జీవోలన్నీ అప్‌లోడ్ చేయండి
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:41 AM
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని జీవోలు, సర్క్యులర్లు, రూల్స్‌ను ఎనిమిది వారాల్లో అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది...
ఉత్తర్వులు, రూల్స్‌నూ అధికారిక వెబ్‌సైట్లలో ఉంచండి
అప్‌లోడ్ చేయని వాటిని ఎనిమిది వారాల్లో పెట్టండి
2017లో జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి సంబంధించిన అన్ని జీవోలు, సర్క్యులర్లు, రూల్స్‌ను ఎనిమిది వారాల్లో అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జీవోలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్లలో పెట్టడానికి సంబంధించి 2017లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల జీవో నంబర్ 4ను తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. ప్రభుత్వ జీవోలు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్‌సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని, వాటన్నిటినీ అప్‌లోడ్ చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్.చంద్రశేఖర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 2023 డిసెంబరు ఏడో తేదీ నుంచి 2025 జనవరి 26వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు 19,064 జీవోలు జారీ చేశాయని, వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద పెట్టిన దరఖాస్తుకు అధికారికంగా సమాధానం ఇస్తూ ప్రభుత్వమే అంగీకరించిందని తెలిపారు. దాదాపు 15 వేలకుపైగా జీవోలు ప్రజలకు అందుబాటులో లేవని వివరించారు. పలు శాఖలు తాము జారీ చేసిన జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు సమాచారం అందుబాటులో లేకుండా చేసేందుకు కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ వ్యవహారాల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయని పేర్కొన్నారు. ‘‘గతంలో పేరాల శేఖర్‌రావు దాఖలు చేసిన పిల్‌లో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ పలు మార్గదర్శకాలు జారీచేసింది. జీవోలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని.. అందుకోసం ఒక సీనియర్ అధికారిని నియమించాలని నిర్దేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అయినా, వాటిని అమలు చేయడం లేదు’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచే విషయంలో ఇప్పటికే డివిజన్ బెంచ్ జారీ చేసిన ఆదేశాలతోపాటు ప్రభుత్వం 2017లో జారీ చేసిన మార్గదర్శకాల జీవో 4ను అమలు చేయాలని పేర్కొంది. ఏవైనా జీవోలను అప్‌లోడ్ చేయని పక్షంలో ఎనిమిది వారాల్లో మొత్తం జీవోలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి నిర్దేశించింది.