Share News

Telangana High Court: 2019 నాటి గ్రూప్‌ 2 ఫలితాలు రద్దు

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:44 AM

బీఆర్‌ఎస్‌ హయాం నాటి 2015 గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ పరీక్ష ఫలితాలను ఫలితాలను కొట్టేస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు గుర్తించే కీలక భాగమైన పార్ట్‌ బిలో ట్యాంపరింగ్‌ చేసిన వారినీ ఉద్యోగాలకు ఎంపిక చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది....

Telangana High Court: 2019 నాటి గ్రూప్‌ 2 ఫలితాలు రద్దు

  • పార్ట్‌-బీ ట్యాంపరింగ్‌ చేసిన వారి ఎంపిక తప్పు.. మళ్లీ పేపర్లు దిద్ది ఫలితాలను ప్రకటించండి:హైకోర్టు

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ హయాం నాటి 2015 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ పరీక్ష ఫలితాలను ఫలితాలను కొట్టేస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు గుర్తించే కీలక భాగమైన పార్ట్‌-బిలో ట్యాంపరింగ్‌ చేసిన వారినీ ఉద్యోగాలకు ఎంపిక చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పార్ట్‌-బిలో వైట్‌నర్‌, ఎరేజర్‌ వాడి ఓఎంఆర్‌ షీట్‌ను దిద్దిన వారిని అనర్హులుగా ప్రకటించాలని సాంకేతిక కమిటీ చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కీలక విషయాన్ని పట్టించుకోకుండా ట్యాపరింగ్‌ చేసిన వారి సమాధాన పత్రాలను సైతం టీజీపీఎస్సీ పరిగణనలోకి ఎలా తీసుకుంటుందని ప్రశ్నించింది. ఈ విషయం నోటిఫికేషన్‌లో సైతం స్పష్టంగా ఉందని గుర్తు చేసింది. ఈ మేరకు 2015లో జారీచేసిన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌కు సంబంధించి 2019లో విడుదల చేసిన ఫలితాలను కొట్టేసింది. ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటించి, సమాధాన పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 8 వారాల్లో పూర్తిచేసి, అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసే క్రమంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయడంలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేసింది.

1032 పోస్టులు

2015లో గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ నెంబర్‌ 20ని టీఎ్‌సపీఎస్సీ జారీచేసింది. దీనికి అనుబంధంగా 2016లో సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ నెంబర్‌ 17ను సైతం జారీ చేశారు. మొత్తంమీద 1032 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ నెంబర్‌ విషయంలో గందరగోళం ఏర్పడటం వల్ల బుక్‌లెట్‌ నెంబర్‌ ఉండే పార్ట్‌-ఎలో తప్పులు జరిగాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి టీఎ్‌సపీఎస్సీ ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఓఎంఆర్‌ షీట్‌లో బుక్‌లెట్‌ నెంబర్‌ ఉండే పార్ట్‌-ఎ, అభ్యర్థి వివరాలు ఉండే పార్ట్‌-సిలో చిన్న చిన్న తప్పులు జరిగినా పర్వాలేదని, సమాధానాలు గుర్తించే భాగమైన పార్ట్‌-బిలో మాత్రం ఏ మాత్రం దిద్దుబాట్లు, వైట్‌నర్‌, ఎరేజర్‌, బ్లేడ్‌ వాడి ట్యాపరింగ్‌ చేసినా సదరు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సైతం సాంకేతిక కమిటీ సిఫార్సులను సమర్థించింది. రెండింటినీ పట్టించుకోకుండా ట్యాంపరింగ్‌కు పాల్పడిన అభ్యర్థుల పేపర్లను సైతం టీజీపీఎస్సీ పరిగణనలోకి తీసుకుని ఫలితాలు ప్రకటించింది.


దీన్ని సవాల్‌ చేస్తూ 2019లో పలువురు అభ్యర్థులు వేర్వేరుగా ఆరు పిటిషన్‌లు వేశారు. జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదించారు. పార్ట్‌-ఎ, పార్ట్‌-బిలో జరిగిన తప్పులను క్షమించవచ్చు గానీ సమాధానాలను ట్యాపరింగ్‌ చేసిన అభ్యర్థులను ఎంపిక చేయడం అక్రమాలను సమర్థించినట్లేనని ఆరోపించారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఆటోమేటిక్‌ స్కానర్లను ఉపయోగించి మూల్యాకనం చేపట్టామని, ఇందులో మానవ జోక్యం లేదని తెలిపారు. ఫలితాలను కొట్టేస్తే ఇప్పటికే నియామకమై ఉద్యోగాలు చేస్తున్న వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పారు. పార్ట్‌-బిలో ట్యాపరింగ్‌కు పాల్పడిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ఇదే హైకోర్టు డివిజన్‌బెంచ్‌ స్పష్టంగా పేర్కొందని ధర్మాసనం గుర్తు చేసింది. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత ముఖ్యమని, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును, సాంకేతిక కమిటీ సిఫార్సును అమలు చేయలేదని స్పష్టంచేసింది. 2019 ఫలితాలను కొట్టేస్తూ తుది తీర్పు వెలువరించింది. పునర్‌ మూల్యాకనం చేపట్టి, అర్హులైన వారికి 8 వారాల్లో నియామక పత్రాలు అందజేయాలని స్పష్టం చేసింది.

గ్రూప్‌-1 అప్పీలుపై విచారణ వచ్చే నెల 22కు వాయిదా

గ్రూప్‌-1పై టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలుపై విచారణను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ డిసెంబర్‌ 22కు వాయిదా వేసింది. వాదనలు వినిపించేందుకు సమయం కావాలని అభ్యర్థులు, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) తరఫు న్యాయవాదులు కోరడంతో అందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. అప్పటివరకు సింగిల్‌ జడ్జి తీర్పు నిలిపివేత ఉత్తర్వులను పొడిగించింది. గ్రూప్‌-1 ఫలితాలను సింగిల్‌ జడ్జి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అప్పీలులోని ఇతర అంశాలపై వాదనలు వినిపించేందుకు గడువు పెంచాలని, వరుసగా రెండు మూడు రోజులు సమయం ఇవ్వాలని ఇరుపక్షాల న్యాయవాదులు కోరారు. వీలైనంత త్వరగా విచారణ ముగించాల్సి ఉందని చెబుతూ తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. ఇకపై ఎవరూ వాయిదా కోరవద్దని స్పష్టం చేసింది.

Updated Date - Nov 19 , 2025 | 04:44 AM