Minister Tummala Nageshwar Rao: 47.68 లక్షల బస్తాల యూరియా నిల్వలున్నయ్
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:58 AM
యాసంగి సీజన్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు (అంటే 47.68 లక్షల బస్తాలు) అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రైతులూ.. ఎలాంటి ఆందోళన చెందవద్దు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు (అంటే 47.68 లక్షల బస్తాలు) అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు అవసరం ఉన్నంత మేరకు యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. యాసంగిలో (అక్టోబరు నుంచి మార్చి వరకు గాను) కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి వివిధ రకాల ఎరువులు మొత్తం 20.10 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు చెప్పారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 5.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా... 5.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని రైతులు భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని అన్నారు. యాసంగి సీజన్‌లో యూరియా పంపిణీకి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపి తెలిపారు. జిల్లాల్లో యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు.
ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు కొత్త పాలకవర్గం
కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్లతో నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 179 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాల నియామకం పూర్తయినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.