Hyderabad Pearls: లోకల్ టు గ్లోబల్!
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:49 AM
రాష్ట్రానికి చెందిన చేనేత, హస్తకళలతో పాటు వ్యవసాయ రంగంలో నైపుణ్యాన్ని చాటిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ కళలకు అంతర్జాతీయ గౌరవం
హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు సహా రాష్ట్రం నుంచి 12 రకాల ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం కసరత్తు
కేంద్రానికి దరఖాస్తు చేసిన రాష్ట్ర సర్కారు
ఇప్పటికే రాష్ట్రం నుంచి 18 రకాల ఉత్పత్తులకు జీఐ ట్యాగ్
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన చేనేత, హస్తకళలతో పాటు వ్యవసాయ రంగంలో నైపుణ్యాన్ని చాటిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండువిడ తల్లో కలిపి 12రకాల ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు(జీఐ ట్యాగ్) సాధించేందుకు పరిశ్రమలశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాబార్డు కసరత్తు ప్రారంభించాయి. మొదటి విడతలో పేర్కొన్న ఐదు రకాల ఉత్పత్తులకు సంబంధించి పరిశోధన వివరాలు సమర్పించడంతో పాటు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. వాటిలో హైదరాబాద్ ముత్యాలు, నారాయణపేట నగల తయారీ, బంజారా గిరిజన నగలు, బంజారా సూది పనులు, సిద్ధిపేట/మెదక్ ప్రాంతాల్లోని బాటిక్ చిత్రకళలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 18 రకాల ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. తాజా ప్రతిపాదనలకు కూడా జీఐట్యాగ్ లభిస్తే తెలంగాణ నుంచి 30 ఉత్పత్తులకు ఆ ఘనత లభించినట్లవుతుంది.
మొదటి విడత దరఖాస్తు ప్రత్యేకతలు
నారాయణపేట నగల తయారీ తరతరాలుగా కొనసాగుతున్న లోహ కళకు ప్రతీక.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన హైదరాబాద్ ముత్యాలు వాటి నాణ్యతకు, విలక్షణమైన మెరుపుకు ప్రసిద్ధి.
బంజారా సూదిపనులు రంగురంగుల దారాలు, అద్దాలు, గవ్వలను ఉపయోగించి గిరిజన మహిళలు చేేస సంప్రదాయ హస్తకళ.
వెండి, ఇతర లోహాలతో కలిపి చేతితో తయారు చేేస బంజారా గిరిజన నగల్లో గిరిజన సంస్కృతి ఉట్టిపడుతుంది.
మైనం ఉపయోగించి వస్త్రాలపై రంగులు అద్దే బాటిక్ చిత్రకళ ఎంతో కళాత్మకమైనది.
రెండో విడత దరఖాస్తులు
రెండో విడతకు సంబంధించి మరో ఏడు ఉత్పత్తుల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటికి జీఐట్యాగ్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయనున్నారు. వాటిలో ఆర్మూర్ పసుపు, నల్గొండ చిట్టి దోసకాయ, కొల్లాపూర్ బెనీషా మామిడి, మహాదేవ్‌పూర్ టస్సర్ సిల్క్, జగిత్యాల నువ్వులు, నాయక్‌పోడ్ మాస్కులు, కొత్తకోట మటన్‌కు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయనున్నారు.
జీఐ గుర్తింపు ఎందుకు ?
జీఐట్యాగ్ అనేది ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి చెందిన ఉత్పత్తికి ఇచ్చే క్వాలిటీ ముద్ర. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ జారీ చేేస ఈ ట్యాగులతో మన సంప్రదాయాన్ని, ఆర్థికాభివృద్ధిని ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. బంగారంపై ఉండే హాల్‌మార్క్ తరహాలోనే ఈ ఉత్పత్తులపైనా జీఐ ట్యాగ్ ఉంటుంది. దీంతో సదరు వస్తువులకు నకిలీ బెడద ఉండకపోగా, అంతర్జాతీయంగానూ అధిక ధర పలుకనున్నాయి. ఉదాహరణకు వరంగల్ చపాటా మిర్చికి జీఐ గుర్తింపు రాకముందు కేజీ మిర్చి రూ.300-350 పలకగా.. ఇప్పుడు దాని ధర కేజీ రూ.700-750 చేరింది. కళాకారులకు, రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. భౌగోళిక గుర్తింపు వల్ల ఆయా ఉత్పత్తులకు చట్టపరమైన భద్రత లభిస్తుంది.
‘వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రొడక్ట్’
‘‘రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక ఉత్పత్తికి భౌగోళిక గుర్తింపు లభించేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసం జిల్లాల్లోని పరిశ్రమ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఏళ్లనాటి సంప్రదాయ ఉత్పత్తులను గుర్తిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రస్తుతానికి 12 వస్తువులకు జీఐ ట్యాగ్ కోసం కసరత్తు చేస్తున్నాం. కొత్తగా రాబోయే భౌగోళిక గుర్తింపులతో తెలంగాణ కీర్తి ప్రపంచ యవనికపై మరింత వెలగనుంది.’’
- శ్రీహారెడ్డి, భౌగోళిక విభాగం, డైరెక్టర్