Medigadda Barrage Repairs: మరమ్మతులు చేయకుంటే బ్లాక్‌లిస్ట్‌లోకే..
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:52 AM
కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ మరమ్మతు పనులపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పీఈఎస్ జాయింట్ వెంచర్‌కు రాష్ట్ర ప్రభుత్వం...
మేడిగడ్డపై ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వం హెచ్చరిక
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘కాళేశ్వరం’లోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ/మరమ్మతు పనులపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ- పీఈఎస్ జాయింట్ వెంచర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది. బ్యారేజీ మరమ్మతు పనులు చేపట్టే విషయమై వారంలోపు అనుకూలంగా స్పందించకపోతే ఈ-ప్రొక్యూర్‌మెంట్‌తోపాటు ఇతర వేదికల్లో తదుపరి టెండర్లు వేయకుండా బ్లాక్‌లి్‌స్టలో పెడతామని తేల్చి చెప్పింది. టెండర్ ఒప్పందం ప్రకారం బ్యారేజీ మరమ్మతులు/పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని సర్కారు పేర్కొన్నది. దీనికి సిద్ధం కాకపోతే నిబంధనల ప్రకారం ఆ సంస్థపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను అమలు చేస్తామని స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మాణ కాంట్రాక్టు కోసం వేసిన టెండర్‌లో దాఖలు చేసిన ఈఎండీ సహా అన్ని డిపాజిట్లు, పెండింగ్ బిల్లులను జప్తు చేస్తామని హెచ్చరిస్తూ ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ ఎస్.సురేశ్‌కుమార్, మేడిగడ్డ బ్యారేజీ ప్రాజెక్టు మేనేజర్‌లకు సూపరింటెండెంట్ ఇంజనీర్ (రామగుండం ఇరిగేషన్ సర్కిల్) ఎండీ దస్తగిర్ ఈనెల 3న లేఖ రాశారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన 2019 నవంబరు, 2020 ఫిబ్రవరి, మే నెలల్లో దాని రక్షణ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. ఈ విషయమై 5 సార్లు నోటీసులిచ్చినా... దెబ్బతిన్న బ్యారేజీలోని కాంపోనెంట్లను నిర్మాణ సంస్థ సరిచేయలేదని దస్తగిర్ గుర్తుచేశారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన రెండేళ్లలోపు లోపాలను సవరించడంతోపాటు మరమ్మతులు (డిఫెక్ట్ లయబుల్టీ కాలం) చేపట్టాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదే అరునా ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేయకుండా ఒప్పందంలోని నిబంధనలను అతిక్రమించిందన్నారు. పనులేవీ పూర్తిచేయకుండా బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్లు, అదనపు పనులు, మరమ్మతులు చేయకుండానే చేసినట్లు అక్రమంగా పొందిన సర్టిఫికెట్‌ను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన తేల్చిచెప్పారు.
ఎల్ అండ్ టీ నిర్లక్ష్యం వల్లే కుంగుబాటు
నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే 2023 అక్టోబరు 21న మేడిగడ్డ ఏడో బ్లాకు 1.256 మీటర్ల మేర కిందికి కుంగిందని, ఆ మరునాడు (2023 అక్టోబరు 22) ఉన్నతాధికారులతో సమీక్ష తర్వాత బ్యారేజీ మరమ్మతులు తామే భరిస్తామని ఎల్ అండ్ టీ ప్రతినిధి సురే్‌షకుమార్ పత్రికా ప్రకటన చేశారని దస్తగిర్ తెలిపారు. బ్యారేజీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మరమ్మతుల విషయంలో డిజైన్ లోపాలే కారణమని, డిజైన్ ప్రకారమే నిర్మించామని తప్పించుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నించిందన్నారు. 2019లో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్న వెంటనే సరిచేసి ఉంటే బ్యారేజీ వైఫల్యం జరిగేది కాదని, ఉద్దేశపూర్వకంగా ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడం, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే బ్యారేజీకి నష్టం జరిగిందని ఆయన గుర్తు చేశారు. తక్షణమే మేడిగడ్డ బ్యారేజీ పనులను చేపట్టడానికి వీలుగా పరీక్షలు చేస్తున్న కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థకు సహకరించాలని, దీనికోసం అవసరమైన సిబ్బంది, సామగ్రి, యంత్రాలను సమకూర్చాలని, లేనిపక్షంలో కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని తేల్చిచెప్పారు.