Musi River: మూసీ అభివృద్ధికి ఏడీబీ నిధులు
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:29 AM
మూసీ నది పునరుజ్జీవం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడీబీ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అనుమతించినట్లు తెలిసింది...
రుణం పొందేందుకు కేంద్రం సూత్రప్రాయ అనుమతి
రూ.4100 కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కార్
ఏడీబీ ప్రతినిధులతో పురపాలక శాఖ ఒప్పందం
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మూసీ నది పునరుజ్జీవం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడీబీ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అనుమతించినట్లు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా బుధవారం ఏడీబీ ప్రతినిధులతో పురపాలక శాఖ అధికారులు సమావేశమైనట్లు, నిధులు ఇచ్చేందుకు ఏడీబీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఏడీబీతో అధికారులు ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలిసింది. ఇక మూసీ అభివృద్ధి ప్రణాళికలపై రెండు నెలల్లో డీపీఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే యోచనలో ప్రభుత్వం ఉంది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ అధికారులు నివేదికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ప్రభుత్వం తొలుత ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణం తీసుకోవాలని భావించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా గత ఏడాది నవంబరులో ప్రపంచ బ్యాంకు రుణంతోపాటు ప్రభుత్వ వాటాగా రూ.1763 కోట్లతో కలిపి మొత్తం రూ.5,863 కోట్లతో కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ నిధులే కాకుండా పర్యాటకం, వాణిజ్య సముదాయాల నిర్మాణం, రహదారులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, వినోద కేంద్రాల ఏర్పాటు వంటి వాటి కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోపాటు పలు ప్రైవేట్ ఏజెన్సీలు, అద్దెలు, లీజులు, ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయ వనరులను సమీకరించనున్నట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ పేర్కొంది. మొత్తమ్మీద ఆరేళ్ల వ్యవధిలో మూసీ అభివృద్ధిని దశల వారీగా పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి..
ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలను అందింపుచ్చుకుని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత సేవల ద్వారా సుస్థిర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉండే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ఎఫైర్స్ వ్యవహారాల విభాగానికి గతేడాది నవంబరులో పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆరేళ్ల వ్యవధిలో రూ.5,863 కోట్ల నిధులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సీఎ్‌సఆర్, పారిశ్రామిక, వాణిజ్య సముదాయాలు, పర్యాటకం నుంచి వచ్చే నిధుల ద్వారా మూసీ సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. 2024 డిసెంబరు 1 నుంచి 2030 డిసెంబరు 30 వరకు ఆరేళ్ల వ్యవధిలో చేపట్టే పనుల వివరాలను తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణం కోసం ప్రిలిమినరీ డీపీఆర్ ఆధారంగా ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఆరేళ్ల వ్యవధిలో పెట్టబోయే ఖర్చుకు సంబంధించి ప్రపంచబ్యాంకు రుణం, బయట నుంచి సేకరించే నిధులుకలిపి 69.9301 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 30.0699 శాతం చొప్పున ఖర్చు చేయనున్నట్లు వివరించింది. అయితే ఇప్పుడు ఈ ప్రతిపాదనలు మారిపోయి.. ప్రపంచ బ్యాంకు రుణం స్థానంలో ఏడీబీ నుంచి రుణం తీసుకోనుంది.