Share News

Chief Minister Revanth Reddy: వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.500 కోట్లు!

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:30 AM

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య, నర్సింగ్‌ కళాశాలల నిర్మా ణం కోసం తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఒకట్రెండు రోజుల్లోనే..

Chief Minister Revanth Reddy: వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.500 కోట్లు!

  • తక్షణమే నిధులు విడుదల చేస్తాం

  • ఇకనుంచి ప్రతి నెలా రూ.340 కోట్లు

  • వైద్యశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

  • నేడు హనుమకొండకు ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య, నర్సింగ్‌ కళాశాలల నిర్మా ణం కోసం తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఒకట్రెండు రోజుల్లోనే నిధులు విడుదలవుతాయన్నారు. వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం తదితర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహలు మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బిల్లుల పెండింగ్‌ కారణంగా వైద్య కళాశాలల నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇకపై ప్రతినెలా వైద్య, నర్సింగ్‌ ఆస్పత్రుల నిర్మాణం కోసం రూ.340 కోట్లు క్రమం తప్పకుండా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. కాగా, వైద్య ఆరోగ్యశాఖలో కేంద్రం నుంచి వచ్చే నిధులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా పీఎం అభిమ్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌, 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి అందాల్సిన నిధులను వెంటనే రాబట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేంద్రం ఇచ్చే 60ు నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 40ు నిధులను జమ చేస్తే, వెంటనే వస్తాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలు, నర్సింగ్‌, టిమ్స్‌ ఆస్పత్రులు, నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణ, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రి నిర్మాణ పురోగతిపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు? ఇంకెంత వెచ్చించాలి? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. వైద్య, నర్సింగ్‌ కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం నిలిచిపోకూడదని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.

సీఎంతో రేవంత్‌తో మీనాక్షి భేటీ

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ)ల నియామక ప్రక్రియ, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, ప్రచారం తదితర అంశాలపై ఇరువురూ చర్చించారు. కాగా, సీఎం రేవంత్‌ బుధవారం హనుమకొండ వెళ్లనున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి స్మారక కార్యక్రమంలో పాల్గొని, నివాళులు అర్పించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Oct 15 , 2025 | 04:30 AM