CM Revanth Reddy: మృతుల కుటుంబాలకు 5లక్షలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:07 AM
సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుబుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అజారుద్దీన్, మజ్లిస్ ఎమ్మెల్యేతోపాటు మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన బృందాన్ని సౌదీకి పంపింది....
పరిహారం ఇవ్వాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయం
మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకి ప్రతినిధులు..
మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు
ఒక్కో కుటుంబం నుంచీ ఇద్దరిని పంపేలా ఏర్పాట్లు..
సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర, కేంద్ర మంత్రుల దిగ్ర్భాంతి
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కిషన్‌రెడ్డి, సంజయ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుబుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అజారుద్దీన్, మజ్లిస్ ఎమ్మెల్యేతోపాటు మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన బృందాన్ని సౌదీకి పంపింది. మృతుల అంత్యక్రియలను మత సంప్రదాయం ప్రకారం మక్కాలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున మృతుల బంధువులను మక్కా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం దుఃఖాన్ని కలిగించిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందించాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవలని ప్రభుత్వానికి సూచించారు. సౌదీ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీఎం సూచన మేరకు తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సౌదీలోని ఎన్నారై కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన ఆయన.. సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్డాలోని భారత కాన్సుల్ జనరల్ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరితో మంత్రి అజారుద్దీన్ మాట్లాడి.. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన యాత్రికులకు వైద్య సాయం అందించాలని, సహాయక చర్యలను సమన్వయం చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని హజ్ హౌస్‌లో సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.
సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడం బాధాకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ ఘటనపై హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు సౌదీలోని భారత అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాగే, ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, ఎన్‌ఎండీ ఫరూక్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురే్‌షబాబు, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.