Kaloji Health University: కాళోజీ హెల్త్ వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం సీజ్
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:54 AM
వరంగల్‌లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ వైద్య విద్య మార్కుల రీవ్యాల్యూయేషన్ ప్రక్రియపై వచ్చి న ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...
ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆదేశాలతో రంగంలోకి అధికారులు
ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం స్పందన
వరంగల్ మెడికల్/హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ వైద్య విద్య మార్కుల రీవ్యాల్యూయేషన్ ప్రక్రియపై వచ్చి న ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్దా ఆదేశం మేరకు కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య మంగళవారం అర్ధరాత్రి వర్సిటీకి వెళ్లారు. పరీక్షల నియంత్రణ విభాగంలోని జవాబు పత్రాలు భద్రపర్చిన గదితో పాటు జవాబు పత్రాలను స్కాన్ చేసిన కంప్యూటర్లను ఎమ్మార్వో సమక్షంలో సీజ్ చేశారు. విచారణ కమిటీ సభ్యులైన ఉస్మానియా వైద్య కళాశా ల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు, హన్మకొండ కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, వరంగల్ విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావులు జరిపిన విచారణలో వర్సిటీ లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఫోరెన్సిక్‌తో పాటు సాంకేతిక బృందాన్ని వర్సిటీకి పంపి సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది.
అక్రమార్కులపై నివేదిక ఇవ్వండి: సీఎం
కాళోజీ వర్సిటీ అక్రమాలపై విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిఘా విభాగాన్ని ఆదేశించారు. ఈనెల 24న కాళోజీ వర్సిటీలో అక్ర‘మార్కులు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో పరిశోధనాత్మక కథనంపై సీఎం స్పందించారు. ఆయన ఆదేశాల నేపథ్యంలో నిఘా విభాగం అధికారులు బుధవారం విచారణ ప్రారంభించారు.
వీసీపై గవర్నర్‌కు ఫిర్యాదు
వ ర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ నంద కుమార్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. హెల్త్ యూనివర్సిటీలో అక్రమార్కులు అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని ఆయన కోడ్ చేశారు. అలాగే గతంలో సరోజిని కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అక్రమాలకు పాల్పడి, సస్పెండ్ అయిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. విద్యార్థుల భవిష్యత్తు, వైద్య విద్య ప్రతిష్ఠ, ఆరోగ్య రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. వెంటనే నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.