Telangana Govt: మత్తయ్య విచారణకు అనుమతి ఇవ్వండి
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:28 AM
ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్యను విచారించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వినతి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్యను విచారించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. నాలుగో నిందితుడు (ఏ4)గా ఉన్న ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను దర్యాప్తు ప్రాథమిక దశలోనే హైకోర్టు కొట్టివేసిందని, అందువల్ల తాము ఇంతవరకు విచారించలేకపోయినట్టు తెలిపింది. 2016లో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా హైకోర్టు దానిని కొట్టివేసింది. దానిని సవాలు చేస్తూ ఏసీబీ 2016 జూలై 6న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్, ఏ4 మత్తయ్యలు దాదాపుగా ఇరవై సార్లు ఫోన్లలో సంభాషించుకున్నారని దీనిపై దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు కేసును కొట్టివేసిందని చెప్పారు. ఈ వాదనను మత్తయ్య తరఫు న్యాయవాది ఖండించారు. ఆయన క్రైం సీన్‌లో లేరని, కేసులో ఇరికించారని చెప్పారు. వాదనల విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. మరోవైపు సెబాస్టియన్ పెట్టుకున్న పిటిషన్‌ను కూడా ఇదే ధర్మాసనం పరిశీలించింది.