KomatireddyVenkatReddy: చిన్న కాంట్రాక్టర్లకు 100 కోట్లు విడుదల
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:11 AM
రోడ్లు, భవనాల శాఖలో చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిల్లో..
‘హ్యామ్’లో 10,547కోట్లతో రోడ్ల నిర్మాణం
చిన్న కాంట్రాక్టర్లు సైతం పాల్గొనవచ్చని స్పష్టీకరణ
సీఎం, మంత్రికి బీఏఐ ధన్యవాదాలు
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):రూ.100కోట్లను శుక్రవారం విడుదల చేసింది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తూ, బిల్లుల చెల్లింపులో ఆర్‌అండ్‌బీ శాఖకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. మరో రూ.50 కోట్ల బిల్లులను త్వరలో చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రూ.10,547 కోట్లతో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్)లో 5,566 కిలోమీటర్ల మేర రోడ్లను ఉన్నతీకరించబోతున్నట్టు పేర్కొన్నారు. హ్యామ్ పనుల్లో చిన్న కాంట్రాక్టర్లూ పాల్గొనవచ్చని వివరించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ రోడ్లు దేశానికి రోల్ మోడల్‌గా మారనున్నాయని, ఆర్ అండ్ బీ మంత్రిగా తాను మాటిస్తున్నానని చెప్పారు. కాగా, బిల్లులకు సంబంధించిన నిధుల విడుదలపై సీఎం రేవంత్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాఽధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి, తెలంగాణ విభాగం చైర్మన్ సురేందర్ ధన్యవాదాలు తెలిపారు. చిన్న చిన్న పనులు చేసి ఎంతో కాలంగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్న చిన్న కాంట్రాక్టర్లకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.
మంత్రితో ఏవియేషన్ జేఎండీ రోహిత్ భేటీ
రాష్ట్ర ఏవియేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకమైన రోహిత్‌రెడ్డి శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోహిత్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ఏవియేషన్ రంగం అభివృద్ధితో పాటు పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది.