Share News

Telangana Govt: నిషేధిత భూముల వివరాలు వారంలో పంపండి

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:03 AM

రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద ఉన్న నిషేధిత భూముల వివరాలన్నీ క్రోడీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది..

Telangana Govt: నిషేధిత భూముల వివరాలు వారంలో పంపండి

  • తహసీల్దార్లకు రెవెన్యూ శాఖ ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద ఉన్న నిషేధిత భూముల వివరాలన్నీ క్రోడీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వారం రోజుల్లో మండలాల వారీగా నిషేధిత భూముల వివరాలు పంపాలని కలెక్టర్లను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్‌ లోకేశ్‌ ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలను సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాలకు ఎందుకు పంపడం లేదని ఇటీవల హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ వివరాలను సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాలకు వెంటనే పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వివరాల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాస్తవానికి 2017 సెప్టెంబరు 15వ తేదీ నుంచి అదే ఏడాది డి సెంబరు మధ్య తెలంగాణలో భూరికార్డుల నవీకరణ జరిగింది. ఆ వివరాల ఆధారంగా జాబితాలను సిద్ధం చేసి ప్రజలందరూ చూడగలిగేలా వెబ్‌సైట్‌ (పబ్లిక్‌ డొమైన్‌)లో పెట్టాలి. కానీ గత సర్కారు దీనిని పట్టించుకోకపోవడంతో సర్కారు, దేవాదాయ, వక్ఫ్‌ భూములు భారీగా అన్యాక్రాంతం అయ్యాయి. 2017 సెప్టెంబరులో చేపట్టిన భూరికార్డుల నవీకరణకు ముందు రాష్ట్రంలో పట్టాభూములు 1.30 కోట్ల ఎకరాలు ఉంటే.. 2020 అక్టోబరు 23వ తేదీ నాటికి 1.55 కోట్ల ఎకరాలకు పెరిగాయి. మరోవైపు రాష్ట్రంలో అటవీ, దేవాదాయ, వక్ఫ్‌భూములు తగ్గిపోయాయి. నిషేధిత జాబితాలోని ఈ భూముల వివరాలు లేకపోవడంతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు అయి పట్టాభూములుగా మారుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో నిషేధిత జాబితాలోని భూముల వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్పష్టత వచ్చాక గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా నిషేధిత భూముల వివరాలను ప్రకటించవచ్చనిరెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Sep 10 , 2025 | 05:03 AM