Removal of All Transport Checkposts: రవాణా శాఖ చెక్‌పోస్టుల తొలగింపు
ABN , Publish Date - Oct 23 , 2025 | 06:14 AM
రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై ఉన్న రవాణా(ఆర్టీఏ) చెక్‌పోస్టులన్నింటినీ ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు...
సీఎం ఆదేశాలను అమలు చేస్తూ ఉత్తర్వు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెక్‌పోస్టుల ఎత్తివేత
సిబ్బందికి ఇతర బాధ్యతలు: కమిషనర్
రవాణా శాఖ ప్రక్షాళనకు చర్యలు
ఏఐతో దళారీలకు అడ్డుకట్ట: పొన్నం
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై ఉన్న రవాణా(ఆర్టీఏ) చెక్‌పోస్టులన్నింటినీ ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారులపై రవాణా శాఖ చెక్‌పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికల్లా అన్ని చెక్‌పోస్టులను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తక్షణమే చెక్‌పోస్టుల ఎత్తివేత నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా చెక్‌పోస్టులను మూసివేసి, రికార్డులు, ఫర్నిచర్‌ను జిల్లా రవాణా కార్యాలయానికి తరలించి, ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదిక అందించాలని రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్‌పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇతర బాధ్యతలు అప్పగించాలన్నారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్లు తొలగించాలని జిల్లా రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. చెక్‌పోస్టులకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని కమిషనర్ స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల్లో ఏసీబీ వరస తనిఖీలు, పెద్ద మొత్తంలో లెక్కల్లో లేని నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. రహదారులపై రవాణా శాఖ చెక్‌పోస్టులను ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఇదివరకే ఎత్తివేశాయి. మొబైల్ పార్టీల ద్వారా ఆకస్మిక తనిఖీలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై రాష్ట్రంలోనూ అదే పద్ధతి కొనసాగనుంది. సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రవాణా చెక్‌పోస్టులన్నింటినీ అధికారులు తొలగించారు.
రవాణా శాఖలో సమగ్ర మార్పులు: పొన్నం
రవాణా శాఖలో సమగ్ర మార్పులకు చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే చెక్‌పోస్టులను రద్దు చేశామన్నారు. రాష్ట్రంలో ఈవీ పాలసీ తెచ్చిన తర్వాత రవాణా శాఖకు రావాల్సిన రూ.577 కోట్ల పన్నును ప్రభుత్వం మినహాయించిందని చెప్పారు. పన్ను మినహాయింపుతో విద్యుత్తు వాహనాల వాడకం భారీగా పెరిగిందన్నారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిందని, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈవీ-విధానాన్ని తీసుకొచ్చిందని వివరించారు. ‘హైదరాబాద్‌లో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చాం. కేంద్రం తీసుకొచ్చిన వాహన్, సారథి పోర్టల్ సేవలు అమల్లోకి వచ్చాయి. గడువు తీరిన పాత వాహనాల్ని తుక్కు చేసేందుకు స్ర్కాపింగ్ విధానాన్ని తీసుకొచ్చాం’ అని పొన్నం చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వాహనాలకు రేడియం స్టిక్కర్లు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లోకి అదేపనిగా వస్తున్నవారిని గుర్తిస్తున్నట్లు చెప్పారు.
మైనింగ్ లారీలు, ట్రావెల్ బస్సులకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
నిబంధనలకు విరుద్ధంగా ఒకే నంబరు ప్లేట్‌పై ఒకటి కంటే ఎక్కువ వాహనాలు తిరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మైనింగ్ వాహనాలు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎ్‌సఆర్‌పీ) తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనింగ్, మినరల్స్ వాహనాలు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. అలాంటి వాహనాల్ని గుర్తించి, యాజమాన్యాలపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.