BC Reservation Amid Local Poll Uncertainty: బీసీ రిజర్వేషన్‌పై ఢిల్లీ కేంద్రంగా.. సర్కారు తుది యత్నాలు?
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:29 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన రేవంత్ సర్కారు.. ఢిల్లీ కేంద్రంగా తుది ప్రయత్నానికి ఉపక్రమించనుందా? డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో మరోమారు ఒత్తిడి తేవాలనుకుంటోందా....
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒత్తిడికి ప్రణాళిక!
ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లే ఆలోచన
పంచాయతీ ఎన్నికలు నిర్వహించి.. పరిషత్ ఎన్నికల విషయంలో పోరాడే దిశగానూ యోచన
1-2 రోజుల్లో మంత్రులు, పార్టీ ముఖ్యులతో సీఎం భేటీ
17న క్యాబినెట్ భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన రేవంత్ సర్కారు.. ఢిల్లీ కేంద్రంగా తుది ప్రయత్నానికి ఉపక్రమించనుందా? డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో మరోమారు ఒత్తిడి తేవాలనుకుంటోందా? ప్రధాని వద్దకు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను తీసుకువెళ్లే యోచన చేస్తోందా? ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ ఇది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. ఎప్పటిలోగా నిర్వహించేదీ చెప్పేందుకు ప్రభుత్వానికి ఈ నెల 24 వరకూ గడువిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపున స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 9ను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి డిసెంబర్ 3 వరకూ గడువు ఇచ్చింది. ఈ రెండు తీర్పుల నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై ఏ వైఖరి తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌కోసం ఢిల్లీ వేదికగా తుది ప్రయత్నం చేయాలా.. లేక హైకోర్టు సూచనల మేరకు పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించి పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే.. డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా మరోమారు ఒత్తిడి కార్యాచరణ చేపట్టే ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. జీవో 9ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 3 వరకూ గడువు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ చెప్పడానికి 24వ తేదీ వరకూ ఇచ్చిన గడువును మరికొద్దిరోజులు పొడిగించాలంటూ హైకోర్టును కోరాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆలోగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణను అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
. అలా గడువు కోరేందుకు అవకాశం ఉంటుందా.. లేదా అన్నదానిపై న్యాయనిపుణులనూ సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా.. ఒత్తిడి కార్యాచరణలో భాగంగా ప్రధాని మోదీని వద్దకు బీజేపీ సహా అన్ని పార్టీల నేతలను, బీసీ సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లే అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 9లో చేర్చాలని కోరుతూ కాంగ్రెస్.. ఇతర పార్టీలతో కలిసి పార్లమెంటు సమావేశాల్లో ఒత్తిడి తేవాలని కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఏఐసీసీ పెద్దలనూ సంప్రదిస్తున్నట్లు సమాచారం. తుది ప్రయత్నంగా ఒత్తిడి కార్యాచరణ తీసుకురావాలా.. లేక 24న హైకోర్టు ఇచ్చే డైరెక్షన్ మేరకు ముందుకు వెళ్లాలా అన్నదానిపై.. ఒకటి, రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, మంత్రులు భేటీ అయి చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. కాగా.. ఈ నెల 17న సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్యనేతల భేటీలో తీసుకున్న నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక ఎన్నికలపై రాష్ట్ర క్యాబినెట్ ఒక స్పష్టతను ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు పెడదామా?
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించక పోవడంతో కేంద్రం నుంచి నిధులు రావడంలో ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వరకూ నిర్వహించి.. పరిషత్ ఎన్నికల విషయంలో ఒత్తిడి కార్యాచరణకు వెళ్లాలన్న అంశాన్నీ రాష్ట్ర సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.