Telangana Government: ముస్లింలకు ఆర్థిక భరోసా
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:21 AM
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి, ఆర్థిక భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అండ్లూరి...
‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన’‘రేవంతన్నా కా సహారా.. మిస్కీనో కే లియే’ పథకాలు
ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్‌లు లక్ష రూపాయల సాయం: అడ్లూరి లక్ష్మణ్
రెండు పథకాలను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి, ఆర్థిక భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అండ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన’, ‘రేవంతన్నా కా సహారా.. మిస్కీనో కే లియే(పేదలకు రేవంతన్న సాయం)’ అనే పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పథకాలు మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయని, పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని వెల్లడించారు. వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందన్నారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ‘రేవంతన్నా కా సహారా మిస్కీనో కే లియో’ పథకం ద్వారా.. ఫకీర్, దూదేకుల వర్గాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష గ్రాంట్‌తో మోపెడ్(వాహనాలు)లను అందిస్తామని, దీంతో వారు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశముంటుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇచ్చిన వెంటనే అమలు చేసే నాయకుడు అని, ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ పథకాలకు ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం ముస్లిం మైనార్టీల పట్ల అంకితభావానికి నిదర్శనం అని చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.