Aadi Srinivas: గ్లోబల్ సమ్మిట్‌పై హరీశ్‌రావుది కడుపుమంట
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:21 AM
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మోడల్ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే, మాజీ మంత్రిహరీశ్‌రావు చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వవిప్ ఆది....
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మోడల్ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే, మాజీ మంత్రిహరీశ్‌రావు చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో తొలిరోజునే సుమారు రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగి ఈ ప్రపంచ స్థాయి సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని, దీంతో తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గత పదేళ్ల ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్‌గా పరిపాలన చేసి దోచుకుందని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని ఆయన విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆదరణపై హరీశ్‌రావు కడుపు మంటతో మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. సమ్మిట్‌ను ‘గోబెల్స్ సమ్మిట్’ అంటూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పదేళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులు చేసి, కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజలకు భ్రమలు చూపించారని దయాకర్ ఆరోపించారు. హరీశ్‌రావు పదేళ్లు కమిషన్ల కక్కుర్తి మంత్రిగా పనిచేశారని, బావబామ్మర్దులు (కేటీఆర్, హరీశ్‌రావు) పోటీపడి రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప, ఎటువంటి విజన్ లేకుండా పాలించారని విమర్శించారు.