Share News

Diwali: దీపావళి ఎప్పుడు

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:21 AM

దీపావళి ఎప్పుడు? క్యాలెండర్‌లో చూస్తే అమావాస్య అక్టోబరు 20వ తేదీ మధ్యాహ్నం దాటాక వచ్చి 21 సాయంత్రం దాకా ఉన్నట్టు కనిపిస్తోంది..

Diwali: దీపావళి ఎప్పుడు

  • ఈ నెల 20వ తేదీనా?.. 21నా??

  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో 20నే!

  • తెలంగాణ విద్వత్‌ సభ కూడా అదే రోజు పండుగ అని వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దీపావళి ఎప్పుడు? క్యాలెండర్‌లో చూస్తే అమావాస్య అక్టోబరు 20వ తేదీ మధ్యాహ్నం దాటాక వచ్చి 21 సాయంత్రం దాకా ఉన్నట్టు కనిపిస్తోంది! ఇలా రెండు రోజుల్లో వ్యాపించి ఉండడంతో పండుగ ఏ రోజు జరుపుకొవాలనేదానిపై అందరిలో సందేహం నెలకొంది. 2025 సంవత్సరంలో సెలవులకు సంబంధించి రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఇచ్చిన జీవోలో ఉన్న జాబితా ప్రకారం దీపావళి పండుగ ఈ ఏడాది అక్టోబరు 20వ తేదీనే. కానీ.. క్యాలెండర్లలో సూర్యోదయ సమయానికి 21వ తేదీన అమావాస్య కనిపిస్తుండడంతో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు.. 18వ తేదీ శనివారం, 19వ తేదీ ఆదివారం రావడంతో.. 20న దీపావళి సెలవు వస్తే మూడురోజులూ ఊళ్లకు వెళ్దామని కొందరు భావిస్తున్నారు. కాబట్టి సందేహాలకు తావు లేకుండా.. సెలవు ఎప్పుడో వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీపావళి అనగానే.. అందరికీ గుర్తొచ్చేది ధనలక్ష్మీ పూజ, కేదార వ్రతం. నరకచతుర్ధశినాడు అభ్యంగన స్నానం సరేసరి. పండితులు చెబుతున్న దాని ప్రకారం సూర్యాస్తమయంలో అమావాస్య తిథి వ్యాప్తి ఉన్నప్పుడు ధనలక్ష్మీ పూజ చేసుకుని పండుగ జరుపుతుంటారు. కొన్ని చోట్ల సూర్యోదయ సమయంలో కేదార వ్రతం చేసుకున్న తరువాతి నుంచి పండుగగా పరిగణిస్తారు. ఇలా రకరకాల అభిప్రాయాలు, ఆనవాయితీలు ఉండడమే ఈ సందేహాలకు కారణం. అయితే.. దీపావళి పండుగకు అమావాస్య ప్రధానం. ఆ తిథి 20వ తేదీ రాత్రి అంతా ఉంది. 21వ తేదీ సాయంత్రానికి పాడ్యమి వచ్చేస్తుంది. 21న రాత్రి అమావాస్య ఉండదు కాబట్టి.. 20వ తేదీనే దీపావళి జరుపుకోవాలని పలువురు పండితులు సూచిస్తున్నారు.

తెలంగాణ విద్వత్‌సభ ప్రకారం..

విశ్వావసు నామ సంవత్సరంలో (30-03-2025 తరువాతి నుంచి వచ్చే పండుగలు) వచ్చే పండుగలను ఎప్పుడు జరపాలనే దానిపై తెలంగాణ విద్వత్‌ సభ విడుదల చేసిన వివరాల ప్రకారం దీపావళి అక్టోబరు 20 (సోమవారం), 21 (మంగళవారం)న కేదార వ్రతం జరుపుకోవాలి.

దీపావళి సోమవారమే

దీపావళి పండుగ విషయంలో ఎలాంటి గందరగోళం లేదు. 20న సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందు నరకచతుర్దశి స్నానం చేయాలి. సోమవారం సాయంత్రం దీపావళి ప్రయుక్త ధనలక్ష్మీ పూజ, మంగళవారం 21వ తేదీన ఉదయం నుంచి కేదార వ్రతాలు ఆచరించాలి. వీటిలో ధనలక్ష్మీ పూజ, నరకచతుర్దశి స్నానాన్ని ప్రజలంతా ఆచరిస్తారు. కేదార వ్రతం మాత్రం అందరూ చేసుకోరు. వంశపారంపర్యంగా ఆ సంప్రదాయం ఉన్నవారు మాత్రమే దాన్ని ఆచరిస్తారు.

- తూండ్ల. కమలాకరశర్మ సిద్ధాంతి,

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

Updated Date - Oct 15 , 2025 | 04:21 AM