Flood Damage: తక్షణసాయం రూ.200 కోట్లు
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:50 AM
రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, వరదలతో జరిగిన నష్టానికి తక్షణసాయం కింద జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది..
వరదల నష్టంపై సర్కారు మంజూరు
తీవ్రంగా ప్రభావితమైన 7 జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున..
మిగతా జిల్లాలకు రూ.5 కోట్ల చొప్పున..
రోడ్లు, వంతెనలు, కల్వర్టుల మరమ్మతుల వంటి పనులకే వాడాలని స్పష్టీకరణ
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, వరదలతో జరిగిన నష్టానికి తక్షణసాయం కింద జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం విపత్తులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధిక వర్షపాతం నమోదై, భారీ నష్టం జరిగినట్టు గుర్తించిన కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున.. మిగిలిన 26 జిల్లాలకు రూ.5 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిధులను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్‌డీఆర్‌ఎఫ్) నిబంధనల మేరకు తక్షణ మరమ్మతులు చేపట్టడానికే ఉపయోగించాలని ఉత్తర్వుల్లో జిల్లాల కలెక్టర్లకు సూచించింది. ప్రధానంగా రోడ్లు, వంతెనలు, కల్వర్టుల మరమ్మతులకు, తాగునీటి సరఫరా పరంగా ఏర్పడిన అవాంతరాలను సరిచేసేందుకు మాత్రమే నిధులను వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ నిధులతో కొత్త పనులు చేపట్టొద్దని, పంట నష్ట పరిహారానికీ వినియోగించొద్దని స్పష్టం చేసింది. పనుల కోసం వినియోగించిన నిధులకు సంబంఽధించిన వినియోగ పత్రాల (యుటిలైజేషన్ సర్టిఫికెట్స్)ను సంబంఽధిత విభాగానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆగస్టు 25 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 50 సెం.మీ కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదవ్వగా, మిగతా జిల్లాల్లో 25-40 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. ఫలితంగా జిల్లాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లడంతో పాటు, పంట నష్టం, ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయని గుర్తించినట్టు జిల్లాల నుంచి సమాచారం వచ్చిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.