Minister Ponam Prabhakar: మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:01 AM
బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.7లక్షలు(ప్రభుత్వం తరపున రూ.5లక్షలు, ఆర్టీసీ తరపున రూ.2లక్షలు), క్షతగాత్రులకు...
క్షతగాత్రులకు రూ.2లక్షల పరిహారం: మంత్రి పొన్నం
రూ.2లక్షలు, రూ.50వేల చొప్పున ప్రకటించిన పీఎంవో
హైదరాబాద్/పరిగి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.7లక్షలు(ప్రభుత్వం తరపున రూ.5లక్షలు, ఆర్టీసీ తరపున రూ.2లక్షలు), క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. సమాచారం తెలియగానే జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ప్రమాద స్థలికి బయలుదేరి వెళ్లిన ఆయన.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం శ్రీధర్‌బాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. క్షతగాత్రుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ కండీషన్, వేగానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రవాణాశాఖ ముఖ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పొన్నం అత్యవసర సమావేశం నిర్వహించారు. రోడ్లపై బ్లాక్ స్పాట్స్ (ప్రమాదాలు జరిగే ప్రాంతాల)ను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు దాడులు చేయడం కాకుండా.. నిరంతర ప్రణాళిక ఉండాలని సూచించారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎ్‌ఫ ద్వారా రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి రూ.50వేలు అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.