Share News

Chief Minister Revanth Reddy: ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ సౌకర్యాలు

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:41 AM

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది....

Chief Minister Revanth Reddy: ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ సౌకర్యాలు

  • విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు

  • కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు

  • రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధిపై సర్కారు దృష్టి

  • ప్రయోగాత్మకంగా తొలుత కొడంగల్‌ నియోజకవర్గంలో పనులు

  • సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్‌గా తీసుకొని.. అక్కడి పాఠశాలల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి, అవసరమైన వసతులు కల్పించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలుత ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం జారీ చేశారు. కాగా, పాఠశాలల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా బడుల్లో సకల సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం 13 అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వాటి ఆధారంగా పాఠశాలల్లో మరమ్మతులు సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది.


పాఠశాలల్లో ప్రభుత్వం చేపట్టనున్న పనులు ఇవే..

  • కంప్యూటర్‌ ల్యాబ్‌లఏర్పాటు, ఇంటర్నెట్‌ సదుపాయం

  • ల్యాబ్‌ ఫర్నీచర్‌, సైన్స్‌ ల్యాబ్‌ల ఏర్పాటు

  • అన్ని ఉన్నత, మాధ్యమిక పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు

  • ప్రతి పాఠశాలలో కనీసం రెండు క్రీడా మైదానాలు

  • స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్లు ఏర్పాటు

  • విద్యార్థులకు ఒక జత షూ, 2 జతల సాక్స్‌ల పంపిణీ

  • విద్యార్థులు, సిబ్బందికి ఐడీ కార్డులు

  • పాఠశాలల్లో సీసీ కెమెరాలు, కలెక్టర్‌, డీఈఓ కార్యాలయాల్లో మినీ విజిల్‌ సిస్టమ్‌

  • ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక సెక్షన్లు

  • ఉన్నత పాఠశాలల్లో ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌

  • 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ మెటీరియల్‌

  • పాఠశాల భవనాలకు మరమ్మతులు

కొడంగల్‌లో పూర్తయిన సర్వే

సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సర్కా రు పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. ఈ నియోజకవర్గంలో నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో మొత్తం 295 పాఠశాలలుండగా 25,469 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో నారాయణపేట జిల్లాలో 126 స్థానిక సంస్థల పాఠశాలలుండగా 11,441 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు కేజీబీవీల్లో కలిపి 578, ఒక మోడల్‌ స్కూల్‌లో 558 మంది విద్యార్థులున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 163 స్థానిక సంస్థల బడుల్లో 12,013 మంది విద్యార్థులు ఉండగా, 3 కేజీబీవీల్లో 879 మంది ఉన్నారు. ఈ పాఠశాలల్లో కల్పించాల్సిన వసతులపై చేసిన అధ్యయనం పూర్తయింది. దాని ప్రకారం మొత్తం 57బడుల్లో బాలురు, 29 బడు ల్లో బాలికల మరుగుదొడ్లు అవసరం కాగా 31 చోట్ల మరమ్మతులు అవసరం. 22బడులకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంది. 163 బడులకు ప్రహరీగోడ, 30 పాఠశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌లు, 144చోట్ల అదనపు తరగతి గదులు, 23 బడుల్లో ప్రధానోపాధ్యాయుల గదుల నిర్మాణం అవసరం ఉందని గుర్తించారు. 121 బడుల క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.

Updated Date - Oct 30 , 2025 | 04:41 AM