Tummidihatti Barrage: 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:17 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిలిచిపోయిన పనులన్నింటినీ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రను ఒప్పించేందుకు నెలాఖర్లో వెళ్లనున్న అధికారులు
165 బదులు 80 టీఎంసీల తరలింపునకే తాజాగా ప్రతిపాదనలు
సాధ్యాసాధ్యాల నివేదిక తయారీకి అధికారుల ముమ్మర కసరత్తు
గత సర్కారు హయాంలో ఆగిన పనుల పునరుద్ధరణకు సంకల్పం
హైదరాబాద్, ఆసిఫాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిలిచిపోయిన పనులన్నింటినీ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే పనులను పునః ప్రారంభించనుంది. ఈ రెండు జిల్లాల ఆయకట్టు ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో ఉండేది. ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్‌లో భాగంగా గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును చేపట్టడంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆయకట్టు మాయమైంది. కాళేశ్వరం బ్యారేజీలు విఫలమవడంతో రేవంత్ సర్కారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పునరుద్ధరించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అక్కడ 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పలు దఫాలుగా అధికారులతో సమీక్ష చేపట్టారు. బ్యారేజీ నిర్మాణం, ముంపు, నీటి లభ్యత తదితరాలపై చర్చించారు. తాజాగా ఈ ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల డీపీఆర్‌ను సవరించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎఫ్‌ఆర్)కు అధికారులు తుది రూపు ఇస్తున్నారు. అనంతరం నీటిపారుదల అధికారులు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవనున్నారు. నిజానికి, 148 మీటర్ల ఎత్తుతోనే బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర గతంలో సమ్మతి తెలిపింది. కానీ, బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో కట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారమే బ్యారేజీ కట్టడానికి వీలుగా మహారాష్ట్ర సర్కారును ఒప్పించేందుకు అవసరమైన కసరత్తును కూడా ముమ్మరం చేసింది. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు 2013 భూసేకరణ చట్టం లేదా మెరుగైన ప్రక్రియ ద్వారా పరిహారం అందించాలని భావిస్తోంది. అనంతరం నెలాఖరులోపు అధికారులు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు.
ఆగిన పనులన్నీ పునరుద్ధరణ
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తల గా భావించే తుమ్మిడిహెట్టి బ్యారేజీ, మెడగా భావించే ఆదిలాబాద్‌లోని 2 లక్షల ఎకరాలు, తోకగా భావించే రంగారెడ్డి జిల్లాలోని 2.47 లక్షల ఎకరాలను గత ప్రభుత్వం పక్కనపెట్టిన విషయం తెలిసిందే. దాంతో లింక్-1లో భాగమైన ప్యాకేజీ-1 నుంచి ప్యాకేజీ-5 దాకా ఆగిపోయిన పనులను పునరుద్ధరించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుగా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలను పూర్తి చేస్తుంది. రంగారెడ్డి జిల్లాలోని పరిగి, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోని 2.47 లక్షల ఎకరాలకు నీరందించే పనులను తిరిగి ప్రారంభించనుంది. వాస్తవానికి, ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం ఎత్తిపోతల పథకా ల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు అనేది కామన్ పాయిం ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో నీటిని నిల్వ చేసి అన్నారంలోకి, అక్కడి నుంచి సుందిళ్లలోకి, చివరికి ఎల్లంపల్లికి నీటిని పంపింగ్ చేస్తా రు. దిగువన 100కి.మీ. నుంచి నీటిని పంపింగ్ చేసుకుంటూ ఎల్లంపల్లిలో వేయడం కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన ఉద్దేశం. అదే ప్రాణహిత-చేవెళ్లలో అయితే తుమ్మిడిహెట్టివద్ద బ్యారేజీ కట్టి.. 116కి.మీ. దూరంలో ఉన్న ఎల్లంపల్లికి నీటిని తరలించాలనేది ప్రతిపాదన. ఇక్కడ 150 మీటర్లతో బ్యారేజీ కడితే 71.5 కి.మీ. దాకా గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించవచ్చు. పంపింగ్‌కు పైసా కూడా ఖర్చు కాదు. 71.5కి.మీ. వద్ద ఉన్న మైలారం వద్ద చిన్న పంప్‌హౌస్ కడితే.. నేరుగా ఎల్లంపల్లిలో నీటిని వేయవచ్చు. 75 శాతం డిపెండబులిటీ వద్ద 165 టీఎంసీల జలాలను ప్రాణహిత-చేవెళ్లలో తరలించాలనేది గత ప్రతిపాదన. తాజాగా 80 టీఎంసీలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని 2.75 టీఎంసీల సామర్థ్యంతో కట్టనున్నారు. ఇక ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మసాగర్ దాకా పనులన్నీ పూర్తయ్యాయి. అక్కడి నుంచి చేవెళ్ల దాకా అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాల్సి ఉంది.
బ్యారేజీ పనులు త్వరగా చేపట్టాలి
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ పనులను త్వరగా చేపట్టాలి. నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత బీడు భూములు సస్యశ్యామలమవుతాయి. ప్రాజెక్టు నిర్మాణంతో రెండు పంటలు వస్తే రైతులు ఆర్థికంగా బలపడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాదిరిగా కాకుండా ఈసారైనా ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించి రైతాంగాన్ని ఆదుకోవాలి.
- చరణ్‌దాస్, తుమ్మిడిహెట్టి