Tummala Nageswara Rao: మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లు
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:08 AM
బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నల ధరలు పడిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించిందని....
8.66 లక్షల టన్నుల మక్కల సేకరణకు ప్రణాళిక: తుమ్మల
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నల ధరలు పడిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మక్కలు సేకరిస్తామని చెప్పారు. గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. మక్కల ధరలు, కొనుగోళ్లపై చర్చించారు. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో రాష్ట్ర ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, సాగు పరిస్థితులు మెరుగవటంతో సగటున ఎకరానికి 18.50 క్వింటాళ్ల దిగుబడితో మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల పంట రానుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమ్మెస్పీ రూ.2,400 కంటే తక్కువగా ఉన్నాయన్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు సగటున రూ.1,959 చొప్పున కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.441 చొప్పున నష్టపోతున్నారని తెలిపారు. ఈ సీజన్‌లో మక్కల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,400 కోట్ల నిధులు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు.