Krishna and Godavari Water Projects: నీళ్లు నిజాలు తేలుద్దాం!
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:56 AM
రాష్ట్రం వినియోగించుకుంటున్న, ఇంకా వినియోగించుకోవాల్సిన నదీ జలాలు, ప్రాజెక్టుల పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాలమూరు-రంగారెడ్డి పథకం కేంద్రంగా బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో..
కృష్ణా, గోదావరి జలాలు, ప్రాజెక్టులపై వాస్తవాలు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధం
2న అసెంబ్లీలో కృష్ణాపై, 3న గోదావరిపై చర్చ
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం వినియోగించుకుంటున్న, ఇంకా వినియోగించుకోవాల్సిన నదీ జలాలు, ప్రాజెక్టుల పరిస్థితిపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాలమూరు-రంగారెడ్డి పథకం కేంద్రంగా బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ హయాంలో అనుసరించిన తప్పుడు విధానాలు, చూపిన నిర్లక్ష్యం, దానితో ప్రస్తుతం తెలంగాణకు ఎదురవుతున్న సమస్యలను పక్కాగా ఎత్తిచూపడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ అంశంపై జనవరి 1న ప్రజాభవన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. 2వ తేదీన అసెంబ్లీలో కృష్ణా జలాలపై, 3వ తేదీన గోదావరి జలాలపై చర్చ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఆ తప్పుడు విధానాలతోనే ఇప్పుడు తిప్పలు!
2014 జూన్ 2వ తేదీ నుంచి 2023 డిసెంబరు 7వ తేదీ దాకా బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ సమాజానికి జరిగిన నష్టాన్ని పక్కాగా వివరించాలని అధికారపక్షం నిర్ణయించింది. గోదావరికి సంబంధించి ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అవినీతి, అక్రమాలను ఎత్తిచూపనుంది. కృష్ణా జలాలకు సంబంధించి ‘పాలమూరు-రంగారెడ్డి’ పథకం కీలకం కానుంది. జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని తరలించి 10 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా 2013 ఆగస్టు 8న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టింది. 90 టీఎంసీల మళ్లింపు సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టి 2022 సెప్టెంబరు 3న కేంద్రానికి డీపీఆర్‌ను సమర్పించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం అప్పటికే చేపట్టిన/ప్రతిపాదించిన/నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రక్షణలు ఉన్నాయని.. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుతో ఎత్తిపోతల ప్రాజెక్టు ఆ రక్షణలను కోల్పోయిందని అధికార పక్షం గుర్తు చేయనుంది. ఇక పాలమూరు-రంగారెడ్డి పథకంపై రూ.27వేల కోట్లు వెచ్చించి, 90శాతం పనులు పూర్తి చేశామని.. మిగతా 10 శాతం పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న బీఆర్‌ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం సిద్ధమైంది. 2022 నాటి డీపీఆర్ ప్రకారం పాలమూరు అంచనా వ్యయం రూ.55,086 కోట్లయితే.. రూ.27 వేల కోట్లతో 90శాతం పనులు ఎలా పూర్తయ్యాయని నిలదీయనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యే నాటికి ప్రాజెక్టులో ఏయే పనులు ఎంత మేరకు అయ్యాయి? ఇంకా ఎంత మేర పెండింగ్‌లో ఉన్నాయి? అనే వివరాలు వెల్లడించనుంది. పర్యావరణ అనుమతి తీసుకోకుండానే పనులు చేపట్టి ఎన్జీటీ ఆగ్రహానికి గురవడం, 7.15 టీఎంసీల తాగునీటి అవసరాల మేరకే పనులు చేస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడాన్ని వివరించనుంది.
ఆ 45 టీఎంసీలపైనే కీలక చర్చ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన దానిలో 45 టీఎంసీలు వాస్తవానికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎ్‌సఎల్‌బీసీ) ప్రాజెక్టుకు చెందినవి. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1986 ఫిబ్రవరిలో 45 టీఎంసీలతో ఎస్‌ఎల్‌బీసీకి అనుమతి కోరుతూ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కు డీపీఆర్ సమర్పించింది. నిజానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే.. బదులుగా 80 టీఎంసీల కృష్ణా జలాలను సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు వాడుకోవడానికి బచావత్ ట్రైబ్యునల్ వెసులుబాటు ఇచ్చింది. అందులో భాగంగా దక్కిన 45 టీఎంసీలను ఎస్‌ఎల్‌బీసీ కోసం అప్పట్లో ప్రతిపాదించారు. కానీ ఆ నీటి కోటాను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరుకు మళ్లించడంతో.. అటు ఎస్‌ఎల్‌బీసీ, ఇటు పాలమూరు రెండు ప్రాజెక్టులు ఆగమయ్యే పరిస్థితి నెలకొందని అధికార పక్షం స్పష్టం చేస్తోంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఏపీ నీటిని తరలించుకునే సామర్థ్యం రోజుకు 4.1 టీఎంసీలు మాత్రమే అయితే.. కేసీఆర్ అధికారంలోకి ఉన్న సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీ ఆ సామర్థ్యాన్ని రోజుకు 13.06టీఎంసీలకు పెంచుకుందని గుర్తు చేస్తోంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ అనంతరం 2015లో 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 34శాతం (299 టీఎంసీలు) చాలని.. ఏపీకి 66 శాతం (512 టీఎంసీలు) ఇచ్చేందుకు కేసీఆర్ సంతకం చేసిన అంశాన్ని ఎత్తిచూపేందుకు అధికార పక్షం సిద్ధమైంది. ఇక 3న శాసన సభలో జరిగే చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు అవకవకలు, లోపాలు, మేడిగడ్డ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలను వివరించనుంది.