TS Govt to Increase Sanitation and Patient Care Staff: ప్రభుత్వాసుపత్రుల్లో పెరగనున్న పారిశుధ్య సిబ్బంది
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:36 AM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు దవాఖానాలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
ఇప్పటివరకు 100 పడకలకు సిబ్బందిని 45 నుంచి 65కు పెంచాలని సర్కారు నిర్ణయం
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు దవాఖానాలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో పారిశుధ్య, భద్రతా, పేషంట్ కేర్ సిబ్బంది సంఖ్యను పెంచనుంది. ప్రస్తుతం ప్రతీ 100 పడకలకు కేవలం 45 మంది సిబ్బంది సేవలందిస్తుండగా ఆ సంఖ్యను 65కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సంబంధిత విభాగాధిపతులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విభాగాఽధిపతులు తమ ఆస్పత్రుల పరిధిలో సిబ్బంది సంఖ్యను పెంచాలని, అలాగే ప్రస్తుతం ఇస్తున్న నిర్వహణ వ్యయాన్ని పెంచాలని కోరారు. వాస్తవానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య, సెక్యూరిటీ, పేషంట్‌కేర్ సేవలనందించే ఏజెన్సీల కాంట్రాక్టులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ముగిశాయి. ప్రస్తుత కాంట్రాక్టర్లనే ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, పెంచిన సిబ్బందితో సేవలందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ప్రతీ వంద పడకలకు 15 మంది చొప్పున పారిశుధ్య, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బంది ఉన్నారు. వారే మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉండే ఆస్పత్రుల్లో ఈ సంఖ్య ఏ మాత్రం సరిపోవడం లేదు. ఈ మూడు విభాగాల్లో సిబ్బంది సంఖ్యను 65కు పెంచబోతున్నారు. అంటే ఒక్కో కేటగిరికి 21-22 మందిని కేటాయించే అవకాశం ఉందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్కారీ దవాఖానాల్లో మొత్తం 36,708 పడకలు ఉన్నాయి. వీటితో పాటు 35 మెడికల్, 37 నర్సింగ్ కాలేజీల్లో కూడా పారిశుధ్య, సెక్యూరిటీ సేవలను అందించాల్సి ఉంటుంది. సిబ్బందిని పెంచితే నిర్వహణ వ్యయాన్ని కూడా పెంచాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కో పడక నిర్వహణకు నెలకు రూ.7,500 అందిస్తోంది. ఈ మొత్తంలోనే పారిశుధ్య సిబ్బందికి వేతనాలు ఇవ్వడంతో పాటు, అవసరమైన వస్తువులను కాంట్రాక్లర్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నిజానికి అవి ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో నిర్వహణ ఏజెన్సీలు ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో లెక్కల్లో 45 మంది సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నట్లు చూపుతున్నా.. అందులో సగం మందితోనే పనులు జరిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ పడకకు నిర్వహణ వ్యయాన్ని రూ.10 నుంచి రూ.13 వేల మధ్య పెంచే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. గతంలో పెద్దాస్పత్రుల నిర్వహణ అంతా అధికారులు ఒకే కాంట్రాక్టరుకు అప్పగించేవారు. ప్రస్తుతం ఆ నిబంధనలను మార్చేశారు. రాష్ట్రం మొత్తాన్ని వివిధ జోన్లుగా విభజించనున్నట్లు సమాచారం. జోన్ల వారీగా టెండర్లు పిలిచి, ఒక్కో జోన్ పరిఽధిలో కనీసం 3 వేల పడకలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు సమాచారం.