Share News

Relief for MBBS Graduates: ఆ మెడికోలకు ఊరట!

ABN , Publish Date - Nov 08 , 2025 | 02:56 AM

పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికత అంశాన్ని తేల్చేందుకు శాపంగా మారిన 148, 149 జీవోల నుంచి ‘ఆ ఎంబీబీఎస్‌’ విద్యార్థులకు ఊరట దక్కనుంది...

Relief for MBBS Graduates: ఆ మెడికోలకు ఊరట!

  • 148, 149 జీవోల సంకెళ్ల నుంచి వారంతా బయటకు

  • వీటి ప్రకారం రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ చదివితేనే లోకల్‌

  • ఆల్‌ ఇండియా కోటాలో బయట ఎంబీబీఎస్‌ చేసిన రాష్ట్ర విద్యార్థులకు పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో నో చాన్స్‌

  • తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి బాధితుల వినతి

  • సానుకూల నిర్ణయం దిశగా ప్రభుత్వం

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికత అంశాన్ని తేల్చేందుకు శాపంగా మారిన 148, 149 జీవోల నుంచి ‘ఆ ఎంబీబీఎస్‌’ విద్యార్థులకు ఊరట దక్కనుంది. వాస్తవానికి ఈ జీవోల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారినే స్థానికులుగా పరిగణిస్తారు. ఈ జీవోల ప్రకారం. అల్‌ ఇండియా కోటా కింద ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన విద్యార్థులంతా నాన్‌లోకల్‌ అవుతారు. ఆ మేరకు నీట్‌లో చక్కని ర్యాంకు సాధించి రాష్ట్రం ఆవల ఎయిమ్స్‌ తదితర ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన రాష్ట్ర విద్యార్థులంతా ఈ వివాదాస్పద జీవోల ప్రకారం స్థానికేతరులైపోయారు. ఇలాంటి విద్యార్థులకు త్వరలో ప్రారంభం కానున్న పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో అన్యాయం జరగనుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నీట్‌ పీజీలో ఆల్‌ ఇండియా స్థాయిలో సీటు లభించని, బయట రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారంతా ఈ జీవోల కారణంగా ఆందోళన చెందుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఆల్‌ ఇండియా కోటాలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారంతా ఈ జీవోల ప్రకారం స్థానికులైపోయారు. ఇలాంటి వారంతా పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానిక కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుటి నుంచి పీజీ వైద్య ప్రవేశాల్లో ఈ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలపి మొత్తం 3,179 పీజీ సీట్లున్నాయి. ఇందులో 1370 సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న పీజీ సీట్లలో 50 శాతం ఆల్‌ ఇండియా కోటాకు వెళ్తాయి. అంటే రాష్ట్ర విద్యార్థులకు మిగిలేది 685 సీట్లే. వీటిలోనే రాష్ట్ర విద్యార్థులతో పాటు ఆల్‌ ఇండియా కోటా కింద ఇక్కడ చదివిన రాష్ట్రేతర విద్యార్థులు కూడా పోటీపడుతుంటారు. కాగా ఆల్‌ ఇండియా కోటా కింద రాష్ట్రానికి చెంది ఇతర రాష్ట్రాల్లో వైద్యవిద్యను పూర్తి చేసిన విద్యార్థులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకొచ్చారు. పీజీ ప్రవేశాల్లో తమను స్థానికులుగా పరిగణించి, అడ్మిషన్స్‌లో అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సర్కారు సానుకూలంగా స్పందించింది. కసరత్తు చేసి, సానుకూల నిర్ణయం తీసుకోవాలని శాఖ ఉన్నతాఽధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఇటువంటి విద్యార్ధులనూ స్థానికులుగా పరిగణించనున్నారు. ఇక ఇప్పటి దాకా కన్వీనర్‌ కోటాలో సీటు పొందాలంటే స్థానికులై ఉండాలన్న నిబంధన ఉంది. ఈ నిబంధనను ఆల్‌ ఇండియా కోటా విద్యార్థుల విషయంలో సడలించే అవకాశం ఉందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై నేడు, రేపో అధికారిక ప్రకటన విడుదలవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Nov 08 , 2025 | 02:56 AM