TG Govt: ప్రభాకర్‌రావు మధ్యంతర రక్షణను రద్దు చేయండి
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:49 AM
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర నిఘా విభాగం (ఎస్‌ఐబీ) మాజీ అధిపతి టి. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని..
విచారణకు సహకరించడం లేదు..
న్యాయమూర్తుల ఫోన్లనూ ట్యాప్ చేశారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం వాదనలు
అంతా అబద్ధం.. వీడియోలు చూడండి
ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది వాదనలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర నిఘా విభాగం (ఎస్‌ఐబీ) మాజీ అధిపతి టి. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభాకర్ రావు మధ్యంతర రక్షణను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రభాకర్ రావు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, కావాలంటే.. విచారణకు సంబంధించిన వీడియో రికార్డులను పరిశీలించాలని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐబీకి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ ఇస్తేనే భారతదేశానికి తిరిగి వస్తానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ మరోసారి సోమవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర, ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు హాజరయ్యారు. తెలంగాణలో రాజకీయ నాయకుల ఫోన్లు మాత్రమే కాదని, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్ చేశారని తెలంగాణ ప్రభుత్వం తరపున తుషార్ మెహతా, లూథ్ర వాదనలు వినిపించారు.
ప్రభాకర్ రావు కోర్టు ఇచ్చిన రక్షణను దుర్వినియోగం చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు సంస్థలకు అప్పగించడానికి ముందే మూడు ఫోన్లు, ఒక అధికారిక ల్యాప్‌టా్‌పలోని మొత్తం డేటాను ఫ్యాక్టరీ రీసెట్ ద్వారా తొలగించారని తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. దీనిని సాధారణ కేసులా పరిగణించవద్దని, ఇది అత్యంత తీవ్రమైన కేసు అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాగా తదుపరి విచారణను ధర్మాసనం అక్టోబరు 8వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందని తెలిపింది. ప్రభాకర్ రావు పూర్తిగా విచారణకు సహకరించాలని, అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లాలని ఆదేశించింది.