Telangana Government: పంచాయతీ ఎన్నికలకు రూ.175 కోట్లు
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:52 AM
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు...
పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేసిన సర్కారు
బిల్లుల చెల్లింపుల్లోనూ మార్పులు
75ు అడ్వాన్స్ చెల్లించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం అధికారులకు భారంగా మారిందని పేర్కొంటూ.. ‘ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.175 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా నిధుల చెల్లింపు ప్రక్రియలో పాక్షికంగా సవరణలు చేసి, 75 శాతం నిధులను ముందస్తుగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఏసీ బిల్లులపై 75 శాతం, డీసీ బిల్లులపై 25 శాతం ప్రకారం అంగీకరించాలని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్, అకౌంట్స్ విభాగానికి ఈ ఉత్తర్వుల ద్వారా సూచించారు. అదేవిధంగా నిబంధనల ప్రకారం డీసీ బిల్లులను సకాలంలో సమర్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.