Telangana Government: ప్రత్యేక జీవోతోనే..
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:12 AM
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవోతోనే వెళ్లేందుకు సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూలును కూడా దశమిలోపే విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
స్థానిక ఎన్నికలకు సర్కారు సిద్ధం.. దశమిలోపు షెడ్యూల్
రిజర్వేషన్లను ఖరారుచేసి రేపు సాయంత్రానికి పూర్తిస్థాయి
నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
బీసీ రిజర్వేషన్ల ఖరారు 2024లో చేసిన కులగణన మేరకు!
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు 2011 జనాభా లెక్కల ప్రకారం
100శాతం ఎస్సీ, ఎస్టీలున్నచోట వారికే.. అందులో 50శాతం స్త్రీలకు
సర్కారు పచ్చజెండా ఊపగానే రిజర్వేషన్ల ప్రకటన
జడ్పీ సీఈవోలు, ఆర్డీవో, ఎంపీడీవోలతో నేడు కలెక్టర్ల భేటీ
ఒకటి, రెండ్రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవోతోనే వెళ్లేందుకు సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూలును కూడా దశమిలోపే విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బీసీల రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో.. పెంచిన రిజర్వేషన్లను అమలుచేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(ఏ)లో చేసిన సవరణలతో జీవో జారీ చేసేందుకు సర్కారు సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకు సంబంఽధించిన ప్రాథమిక నివేదికను రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సీఎం, మంత్రులు పరిశీలించినట్టు సమాచారం. విజయదశమిలోగా షెడ్యూలు విడుదలకు వీలుగా.. వార్డులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికకు అవసరమైన రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని, రెండు రోజుల్లోగా వాటిని ఖరారు చేసి పంపాలని జిల్లాల కలెక్టర్లకు సర్కారు ఆదేశాలిచ్చింది.
పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఆ శాఖ డైరెక్టర్ సృజనలతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రధానమైన రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కీలక సూచనలు చేసి.. పూర్తిస్థాయి నివేదికలను రూపొందించాలని.. ఖరారు చేసిన రిజర్వేషన్ల స్థానాల వివరాలన్నింటినీ సీల్డ్ కవర్‌లో ఉంచి, నివేదికలను మంగళవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే ఆయా స్థానాల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లాల వారీగా ప్రకటించేలా అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని కూడా కలెక్టర్లకు సూచించారు.
భేటీలకు పిలుపు..
స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్ల ఖరారుపై సూచనలు అందడంతో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సబ్ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీవోలు, అదనపుకలెక్టర్ (లోకల్ బాడీస్), ఎంపీడీవోలతో సోమవారం ఉదయం సమావేశాలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకే సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు చేరుకోవాలంటూ ఆదివారం సాయంత్రమే సంబంధిత అధికారులకు సందేశాలను పంపించారు. కాగా రిజర్వేషన్‌ల ఖరారుకు అవసరమైన సమాచారం మొత్తాన్నీ ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు అందించింది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం.. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 2024లో నిర్వహించిన కులగణన వివరాల ప్రకారం ఖరారు చేయాలని కలెక్టర్లకు సూచించింది. ఆ వివరాలన్నింటినీ కలెక్టర్లు సోమవారం నిర్వహించే సమావేశంలో క్షేత్రస్థాయి ఽఅధికారులకు అందించి రిజర్వేషన్లను ఖరారు చేయాలని సూచించనున్నారు. కాగా స్థానిక ఎన్నికల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి 1-2 రోజుల్లో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆ సమావేశంలో ఎన్నికల నిర్వహణ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారికవర్గాల సమాచారం.
మారనున్న గ్రామాల రిజర్వేషన్లు..
రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం కొన్ని గ్రామాలను మునిసిపాలిటీల్లో విలీనం చేసింది. దాంతో గత ఎన్నికల సమయంలో ఉన్న మొత్తం గ్రామాల సంఖ్యలో కొంత తగ్గింది. తాజాగా ఖరారు చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామపంచాయతీలు, 565 మండలాలు, 31 జిల్లాలు ఉన్నాయి. 1,12,534 మంది వార్డు సభ్యులు ఉండగా.. 5,763 ఎంపీటీసీలు, 565 మండల ప్రజా పరిషత్‌లు, 31 జిల్లా ప్రజాపరిషత్‌లు ఉన్నాయి. వీటి ప్రకారం రిజర్వేషన్‌లను ఖరారు చేయనున్నారు. ఈసారి జరగబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామాలవారీ రిజర్వేషన్లు మారనున్నాయి. ఉదాహరణకు.. గత ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో అక్కడి జనాభా ప్రకారం బీసీ/ఎస్సీ/ఎస్టీ/జనరల్‌కు కేటాయించి ఉంటే అందు లో మార్పులుంటాయి. అంటే గతంలో ఉన్న సామాజికవర్గానికి ఈసారి ఆ గ్రామాన్ని రిజర్వ్ చేయరన్నమాట. వేరే సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటాయింపులు పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంచుతారు.
ఇదీ లెక్క
సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో 50శాతం స్థానాలు మహిళలకు లాటరీ పద్థతిలో కేటాయించనున్నారు. 100శాతం ఎస్సీ, ఎస్టీ గ్రామాలున్న చోట వారికే రిజర్వేషన్ ఇవ్వనున్నారు. అందులోనూ మహిళలకు 50ుమేర కేటాయిస్తారు. 2018లో తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మార్చనున్నారు. ఉదాహరణకు.. ఒక జిల్లాలో 14 జడ్‌పీటీసీ స్థానాలు ఉంటే, వాటిలో ఎస్టీలకు 2, ఎస్సీలకు 2, బీసీలకు 3 కేటాయిస్తారు. మిగిలిన 7 స్థానాలను రిజర్వ్ చేయకుండా ఉంచుతారు. ఆ తరువాత వాటిలో సగం స్థానాలు (50 శాతం) మహిళలకు రిజర్వ్ చేస్తారు.